Drinking Water Problems in Andhra Pradesh : రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు పడతున్నా వేసవి తాపం మాత్రం పోలేదు. ఈ వేసవిలో తాగునీటి కోసం పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతుంటే తాగునీటి పైపుల లీకేజీ మరమ్మతుల పేరిట నీటిని నిలిపివేయడంతో కాకినాడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకటి నుంచి 13వ వార్డు వరకు తాగునీటితో ఇబ్బందిపడుతున్నారు. దీనికి తోడు తాగునీటి పైపు లీకేజీ కావడంతో సమస్య మరింత జఠిలమైంది. మరమ్మతులు చేసేందుకు నీటి సరఫరా నిలిపివేశారు. మూడు రోజులుగా నీరు రాక జనం దాహం కేకలు పెడుతున్నారు. దుమ్మలపేటలో ఒకే ఒక్క ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంపై మహిళలు మండిపడుతున్నారు. ట్యాంకర్ వద్ద నీటికోసం మహిళలు ఒక్కసారిగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది.
రెండు నెలలుగా నీరు లేక తీవ్ర ఇబ్బందులు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆస్పరిలో ప్రజలు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా నీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసి సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. అనంతపురం జిల్లా D.హీరేహాల్ మండలం సిద్ధాపురం తండాలో తాగునీరు పట్టుకునే శుద్ధజల ప్లాంటు వద్ద చెలరేగిన ఘర్షణ పెద్దదై వైఎస్సార్సీపీ, తెలుగుదేశం శ్రేణులు దాడులు చేసుకున్నారు. వైసీపీ నాయకులు తెలుగుదేశం వర్గీయులపై కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడి చేశారు. గాయపడిన వారిని బళ్లారి విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమస్యను పరిష్కరించాలంటూ నిరసనలు : నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని దుర్గా పేట కాలనీలో తాగునీటిని సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గత కొంత కాలంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కారించాలని మున్సిపల్ అధికారులను కోరారు.
గుక్కెడు నీటి కోసం మూడు కిలోమీటర్లు నడిచే పరిస్థితి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు, చిన్న లక్ష్మీపురం, శివకృష్ణపురం సహా చుట్టుపక్కల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ఇక్కడి ప్రజలు సుమారు 3 కిలోమీటర్లు ఇసుకలో నడిచివెళ్లాల్సిందే. ఇంత కష్టపడి అక్కడికి వెళ్లినా అప్పటికే పెద్ద క్యూలైన్ ఉంటుంది. తీర ప్రాంతంలో చెలమలు తవ్వుకుని బిందెడు ఊట నీరు పట్టుకుంటున్నారు. అవి కూడా ఎర్రటి రంగులో ఉంటాయి. వాటిని వడపోసి ఇంటికి తీసుకువెళ్లి మరగబెట్టి తాగాలి. ఊరిలో ఎక్కడ బోరు బావి తవ్వినా, ఉప్పు నీరు రావటంతో రెండు దశాబ్దాలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఊట నీరు తాగటంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీరే కాదు, వాడకానికీ కొనాల్సిందే- ఉరవకొండలో జనం అవస్థలు - Water Problem in Uravakonda
బురదనీటిలో కూర్చుని మహిళ నిరసన - ఇంతకీ ఎందుకంటే? - WOMAN PROTEST ON MUDDY ROAD