Dog Show Programme In Vijayawada Attracted People : రోడ్డుపై భౌ భౌ అంటూ అందరిపై అరిచే శునకాలు అందంగా ముస్తాబు అయ్యాయి. చక్కగా చొక్కా , గౌనుతో సోకు చేసుకుని షోకు రెడీ అయి వచ్చాయి. విజయవాడ కెన్నల్ అసోసియేషన్, షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన డాగ్ షో లో రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని రకాల బ్రీడ్ శునకాలు పాల్గొన్నాయి. షో లో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి.
ఎప్పుడూ భౌ భౌ అంటూ అందరినీ భయపెట్టే శునకాలు డాగ్ షో లో అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షించాయి. విజయవాడ కెన్నల్ అసోసియేషన్ , షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాలకు చెందిన 200కు పైగా బ్రీడ్ శునకాలు పాల్గొన్నాయి. రాట్ వీలర్, పమేరియన్, జర్మన్ షెప్పర్డ్, లాబ్ రేడర్, చువావా, చౌచౌ, గ్రేట్ డేన్, హక్కీ, గోల్డెన్ రిట్రీవర్, బీగెల్ వంటి ప్రముఖ బ్రీడ్‌లకు చెందిన శునకాలు పోటీలకు హాజరయ్యాయి.
శునకాలను ముందుగా పరీక్షించిన నిర్వాహకులు అర్హులైన వాటిని పోటీలకు ఎంపిక చేశారు. మైదానంలో యజమానితో పాటు శునకాలు ఎంతో హుషారుగా పరుగులు పెట్టాయి. యజమాని ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. చూపరులను అలరించాయి. చార్లీ అనే బుజ్జి శునకం మొదటి బహుమతి సాధించింది. అంతేకాదు మూడు దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పతకాలు సాధించి ఔరా అనిపించిందని చార్లీ యజమాని చెబుతున్నారు.
విశాఖలో అలరించిన పెట్ ఫెస్ట్..
'నా బుజ్జి డాగ్ గ్రేట్ డేన్ బ్రీడ్. దీని వయసు 16 నెలలు. దీనికి సెకెండ్ బెస్ట్ ఇన్ షో వచ్చింది. ఇది దీనికి మొదటి షో. ఫస్ట్ షో లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.' -సాయి కుమార్, ద్వితీయ బహుమతి గ్రహీత
డాగ్ సైకాలజీ నిపుణులు ప్రవీణ్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. పోటీల్లో యజమానితో శునకాలు ఎంత అన్యోన్యంగా ఉంటాయో అనే కోణంలోనూ పరిశీలించామని తెలిపారు. రెండు వందలకు పైగా శునకాలు ఒకే వేదికపైకి రావటం చిన్నారులను ఎంతో అలరించింది. డాగ్ షో లో పాల్గొనడంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.
నగరవాసులను ఆకట్టుకున్న డాగ్ షో.. ప్రత్యేక ఆకర్షణగా పిల్లుల పోటీలు