Diarrhea Cases in Gurla : విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం ప్రబలింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు మరణించారు. ఇవాళ ఒక్క రోజే నలుగురు మృతిచెందారు. తోండ్రంగి రామయ్యమ్మ (60) ఇంటివద్దే మరణించగా సారిక పెంటయ్య (65), కలిశెట్టి సీతమ్మ (45) వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతువాత పడ్డారు. పైడమ్మ (50) అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
అతిసారంతో మరో 10 మంది బాధితులు విజయనగరం, విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా వైద్యసేవలు అందించిన ఆశా కార్యకర్త రాజేశ్వరికి కూడా అతిసారం సోకింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మృతి చెందిన వారందరికీ అతిసారంతోపాటు బీపీ, షుగర్, గుండె, కిడ్నీ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే గ్రామంలో శానిటేషన్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు.
మెట్టవలసలో డయేరియా అలజడి - ఆస్పత్రిలో చేరిన 40 మంది - Diarrhea Spreads in Srikakulam