Deputy CM Pawan Kalyan Tour in Pithapuram: ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలను ఇక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు. అలానే భవిష్యత్తులో 20 వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్కాముల్లో వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది: అనంతరం పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. 6 నెలల్లో ఏం చేశారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే తాము వచ్చాక 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని వివరించారు. పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్తానని, అందరినీ పలకరిస్తానని తెలిపారు. అలానే పిఠాపురానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందమని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టించిందని పవన్ ఆరోపించారు. ఎన్డీయే, చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారని కొనియాడారు.
తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలి: రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలని అలా తప్పు జరిగితే అది మా అందరి సమష్టి బాధ్యత అని పవన్ అన్నారు. బాధ్యతగా ఉన్నందునే తిరుపతి ఘటనపై మనస్ఫూర్తిగా క్షమాపణ కోరానని తెలిపారు. ఎవ్వరికైనా ఎక్కడ ఎలా స్పందించాలో తెలియాలని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఘటన చూశామని, ఎవరి బాధ్యత వాళ్లు సరిగా చేస్తే సరిపోయేది కానీ కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి, అధికారి ఎవరైనా సరే వారివారి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కొంతమంది పని చేయడం మానేశారని మండిపడ్డారు. న్యాయం అందరికీ జరిగేలా చూడడం ముఖ్యమని, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని చెప్పానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
ఇంతమంది అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది?: పవన్ కల్యాణ్
నేను మాత్రమే దోషిగా నిలబడాలా: తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్, సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని పవన్ అన్నారు. తాను క్షమాపణలు చెప్పినప్పుడు మీరు చెప్పడానికి నామోషీ ఏంటని ప్రశ్నించారు. మా తప్పు లేదంటే ఎలా? నేను మాత్రం దోషిగా నిలబడాలా? అని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీకు వేరే దారి లేదని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి జిల్లాల పర్యటన మొదలుపెడతానని వెల్లడించారు. బాధ్యతగా ఉంటూ నాయకులను కలుపుకుని పని చేస్తానని స్పష్టం చేశారు. విప్లవకారుడు రాజకీయనాయకుడైతే ఇలాగే ఉంటుందని అన్నారు. నాకు డబ్బు, పేరు ఇష్టం లేదు కానీ బాధ్యత ఉందని తెలిపారు. నాకు దేవుడు అవసరమైనంత డబ్బు, పేరు ఇచ్చాడు కానీ నేను ప్రజలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వివరించారు.
వీఐపీ ట్రీట్‌మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్‌మెంట్ పెరగాలి. నాతో సహా అందరికీ 6 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తయింది. మీరు నన్ను నమ్మి గెలిపించారు నిలబెట్టి పని చేయిస్తా. ఒళ్లు వంచి పని చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను. 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ఉండాలని కోరుకుంటున్నాను. నాకు అధికార యంత్రాంగం సహకారం కావాలి. నాకు అధికారం అలంకారం కాదు, అది ఒక బాధ్యత. ఎవరైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తొక్కి నార తీస్తాను.- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
తిరుపతి ఘటన వెనక కుట్రకోణం! - టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు
భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?- అధికారులపై చంద్రబాబు ఆగ్రహం