Deputy CM Pawan Kalyan Received People Requests : తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి పవన్ కల్యాణ్ స్వయంగా వినతులు స్వీకరించారు. మదనపల్లెకు చెందిన ఎంఆర్ లహరి కన్సల్టెన్సీ సంస్థలు (MR Lahari Consultancy Institutions) చేస్తున్న మోసాన్ని బాధితులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఏపీవారిపై మానవత్వం చూపండి : ఆల్ ఇండియా పర్మిట్‌తో, తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకొని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్‌లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని, ఫలితంగా 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్‌లు హైదరాబాద్‌లో ఉండకూడదంటూ వారిని అడ్డుకోవడం సబబు కాదనీ పవన్ అన్నారు. కార్మికులు కలసికట్టుగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటుందని పవన్ వారికి హామీ ఇచ్చారు.
"కార్మిక సోదరులందరూ బాగుండాలని కోరుకునేవాడిని. హైదరాబాద్ పరిధిలో ఉన్న క్యాబ్ డ్రైవర్ల సోదర సంఘాలకు నా విన్నపం. కొద్ది కాలం సహనంతో భరించండి. మీరు వేరు మేము వేరు కాదు. మనమంతా ఒక్కటే. ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లకు కొంత సమయం ఇవ్వమని కోరుకుంటున్నా"-పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
అమెరికాలో విద్య అంటూ మోసం : ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేందుకు కన్సల్టెన్సీని సంప్రదించగా కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి రూ. 30 లక్షలు తీసుకొని కన్సల్టెన్సీ నిర్వాహకులు మోసం చేశారని పవన్ కి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తన కార్యాలయ అధికారులను పవన్ ఆదేశించారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ : అమెరికాలో ఉన్న విశ్వ విద్యాలయాలు, కాలేజీలకు సంబంధించిన సమాచారం, ఉన్నత విద్యకు వెళ్ళేందుకు అవసరమైన గైడెన్స్ రాష్ట్ర విద్యార్థులకు అందించేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత అనే బాలిక నరాల బలహీనతతో బాధపడుతోందని తమ బిడ్డకు వైద్యం అందించాలని పవన్‌ను ఆమె తల్లిదండ్రులు కోరగా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య నిపుణులతో, సంబంధిత శాఖతో మాట్లాడాలని సూచించారు.
వినతుల వెల్లువ : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన దాడులు, దౌర్జన్యలు, అన్యాయాలపై తమకు న్యాయం చేయాలని బాధితులు జనసేన కార్యాలయానికి క్యూ కట్టారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా వేదికలో పాలకొండ నిమ్మల జయకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తన కుమారుడు గంజాయికి అలవాటుపడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూనని విజయవాడకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పర్చూరు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ఓ మహిళ బలవంతంగా ఆక్రమించిందని, తమకు న్యాయం చేయాలని కర్నూలువాసులు కోరుకున్నారు.