Pawan Kalyan on Palle Panduga and Panchayat Varotsavalu: రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' నిర్వహించాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాలలో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తుల ఏర్పాటు చేసి జీవనోపాధి మెరుగు పరచటం ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలని స్పష్టం చేశారు.
పని కోరిన 15 రోజులలో పని పొందే హక్కు, లేనట్లు అయితే నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసానికి 5 కి.మీ.కంటే దూరం ఉంటే రోజూ కూలీకి అదనంగా 10శాతం వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమచికిత్స, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు 300 ఇవ్వాలని సూచించారు. పని ప్రదేశంలో కూలి మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి 50వేల రూపాయల నష్ట పరిహారం వంటి హక్కులను వారికి అందించాలని అన్నారు.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం
ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా అందరి సహకారంతో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించామని ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నామని గుర్తుచేశారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా రూ.4500 కోట్ల పనులకు గ్రామసభల ఆమోదం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకుగాను మంజురైన పనులను పండుగ వాతావరణంలో భూమిపూజ చేయడానికి సంకల్పించామన్న పవన్ ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో "పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాలు" కార్యక్రమంలో ఈ పనులకు పెద్దఎత్తున భూమిపూజ చేయాలన్నారు.
ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై అవగాహన కల్పించాలని పవన్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 25.50 కోట్ల పనిదినాలు, అలాగే 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని ఇవ్వడానికి సంకల్పించిన్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో చేపట్టే పనుల్లో పండ్ల తోటలు, ఫార్మ్ పాండ్లు, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధి ఏపీవోలు పాల్గొన్నారు.
"త్వరపడండి!" మద్యం టెండర్లకు రేపే లాస్ట్ - గ్రామీణ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు!
"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు