Dasara Sharan Navaratri Celebrations 2024 : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గమ్మ గుడి వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల నిర్వహణ విషయంలో గతేడాది లోపాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే క్యూలైన్లు, స్నానఘాట్‌లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారేజీలో నీరు అధికంగా ఉండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గా, పద్మావతి ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు 700 షవర్లు ఏర్పాటు చేశారు.
ప్రసాదం కౌంటర్ మార్పు : అమ్మవారిని దర్శించుకుని శివాలయం మెట్ల మార్గంలో బయటకు వచ్చేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కిందకు దిగిన తర్వాత శివాలయం మెట్ల సమీపంలో అన్నదాన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మల్లికార్జున మహామండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రసాదాల విక్రయాలను కనకదుర్గానగర్‌కు మార్చారు. 2 రోజులు ముందుగానే భక్తులకు కనకదుర్గానగర్‌లోని కౌంటర్లలో లడ్డు, చక్రపొంగలి, పులిహోర ప్రసాదాలను విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు.
అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు మల్లేశ్వర ఆలయ మెట్లు మీదుగా మల్లికార్జున మహా మండపానికి వచ్చిన వారు ప్రత్యేక క్యూలైన్‌లో అన్నప్రసాదం స్వీకరించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. బఫే విధానంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. బీ సాంస్కృతిక కార్యాక్రమాల వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్ర ఆలస్యమైంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యే కళాకారులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం పంపలేదు. వేదికను కనకదుర్గానగర్ ఎంట్రెన్స్‌లో ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించారు. దీంతో శరన్నవరాత్రుల్లో కళాకారుల ప్రదర్శనలకు మార్గం సుగమం అయ్యింది. కళాకారుల నుంచి 450 దరఖాస్తులు రాగా వాటిల్లో 300 వరకు ప్రదర్శనకు అవకాశం ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠాత్మకంగా దసరా ఏర్పాట్లు : మంత్రి ఆనం - Dussehra Arrangements
పూర్తయిన క్యూలైన్ల పనులు : కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా 2 కిలోమీటర్లు మేర నడుచుకుంటూ వెళ్లి భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా 5 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకు క్యూలైన్లు, కేశఖండనశాల పనులు మాత్రమే జరిగేవి. ఈసారి మాత్రం అధికారులు అప్రమత్తమై ఉత్సవాలకు 2 రోజులు ముందుగానే పనులు పూర్తి చేశారు. ఇప్పుడు ఘాట్ రోడ్డులోని మొదటి మలుపు వద్ద రక్షణ గోడ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భక్తుల సౌకర్యర్థం కొంతమేర క్యూలైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూలైన్ల సమీపంలోనే లగేజీ, పాదరక్షలు భద్రపర్చుకునేందుకు క్లాక్ రూములను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అన్నిచోట్లా అప్రమత్తం చేస్తూ : అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతిచోటా హెచ్చరిక బోర్డులను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లో ఉన్నప్పుడు తోపులాటకు గురిచేసి విలువైన వస్తువులను అపహరించే ప్రయత్నం చేసే దొంగలున్నారు జాగ్రత్తగా ఉండాలని భక్తులకు హెచ్చరిక బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేశారు. ప్రసాదాల కౌంటర్లు, అన్నదాన మార్గం చూపే బోర్డులు అన్ని చోట్లా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ సూచికలను చూసుకుంటూ ఆయా కౌంటర్ల దగ్గరకు ఎవరినీ అడిగే అవసరం లేకుండా వెళ్లవచ్చు అని ఆలయ అధికారులు తెలియజేశారు. బీ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు, స్నానఘాట్‌లు, కేశఖండనశాల ఇలా ప్రతిచోటా తాగునీటి ట్యాంకులును అందుబాటులో పెట్టారు. కేశఖండనశాల, ఘాట్‌రోడ్లలో మొబైల్ టాయిలెట్లు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses