Cyber Crimes Increasing in Vijayawada : రోజుకో కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొరియర్ పేరుతో మొదలు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ నోటీసులిచ్చి అమాయకులను భయపెట్టి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే డబ్బులు కట్టండి కేసు లేకుండా చేస్తామని అందినకాడికి దోచేస్తున్నారు.
ఇలా బెదిరించి విజయవాడకు చెందిన ఓ వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. నగరానికి చెందిన వ్యక్తికి హటాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు బుక్ చేసిన కార్గో పార్శిల్‌ను ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు . అందులో నిషేధిత వస్తువులతో పాటు డ్రగ్స్ ఉన్నాయి. నార్కోటిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారని భయపెట్టారు. వెంటనే స్కైప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడాలని లింక్ పంపారు. వీడియో కాల్ చేయగానే పోలీస్ డ్రస్ వేసుకుని, వాకీటాకీ, పోలీస్ స్టేషన్ బ్యాక్ గ్రౌండ్ లో కూర్చుని బాధితుడితో మాట్లాడాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంటూ ఆన్ లైన్ లో నోటీసు పంపిస్తారని బెదిరించారు. నిర్దోషి అని నిరూపించుకోవాలంటే బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేయాలని నమ్మించారు.
అక్రమ ప్రొడక్ట్స్ అంటూ ముంబై పోలీసుల ఫోన్ - తీరా చూస్తే!
బ్యాంకు ఖాతాలో ఉన్న నగదులో 20 శాతం చెల్లించాలని చెప్పి ఖాతా నంబర్ ఇచ్చారు. షాక్ లో ఉన్న బాధితుడు వెంటనే కొంత నగదు చెల్లించాడు. విడతల వారీగా టాక్స్, ఈడీ ఇలా కొన్ని పేర్లతో 5 లక్షల రూపాయల వరకు సైబర్ నేరగాళ్లు డబ్బు గుంజారు. మళ్లీ నగదు వేయాలని డిమాండ్ చేయటంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుని బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. ఖాతాలో ఉన్న రెండున్నర లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.
ఇటీవల కాలంలో కొరియర్ పార్శిల్ పేరుతో ఫోన్ చేసి డిజిటల్ నోటీసు పంపి అరెస్ట్ చేస్తామనే కేసులు తరచుగా నమోదవుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నిందితులు విదేశాల్లో ఉండి దందా కొనసాగిస్తున్నారని వారు గుర్తించారు. బాధితులను నమ్మించేందుకు పోలీసుల డ్రెస్ లో స్కైప్ కాల్ చేస్తున్నారన్నారు. రాజస్థాన్, యూపీ లాంటి ప్రాంతాల్లో పేదలకు డబ్బు ఎరవేసి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలను తెరుస్తున్నారు. దోచిన సొత్తును ఆ ఖాతలకు పంపి విదేశాలకు తరలిస్తున్నారు. తాము పార్శిల్ చేయకుండా తమ పేరుపై ఎలా వస్తుందని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని పోలీసులు చెబుతున్నారు.
ఎవరైనా దోపిడీకి గురైతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దని హితవు పలుకుతున్నారు.
బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసి ₹5 లక్షలు చోరీ- 3 దఫాలుగా దగా - Cyber Fraud In Kurnool Disrtict