Criticism that EC is Depend on CS Jawahar Reddy: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసీచూడనట్టే ఉంది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సూచించిన వారికే పోస్టింగులు ఇస్తోంది. అసలు ఈసీ పరిధిలో సీఎస్ పని చేస్తున్నారా? సీఎస్ నియంత్రణలో ఈసీ పని చేస్తోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ - CS and DGP Explanation to EC
వివాదాస్పద అధికారిపై ఎలా ఆధారపడతారు: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్ ఆ బాధ్యతను విస్మరించారు. కొన్నిచోట్ల చోటుచేసుకున్న హింసకాండకు అక్కడి ఎస్పీలు, కలెక్టర్లను బలిపశువుల్ని చేశారు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్ పంపిన నివేదికపైనే పూర్తిగా ఆధారపడింది.
అధికార పార్టీకి వీర విధేయత: సీఎస్‌పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సిఫారసులు హేతుబద్ధంగా ఉంటున్నాయా? లేదంటే ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా. స్క్రీనింగ్ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందనే విషయాల్ని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలున్నాయి. సీఎస్‌పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై నివేదిక పంపాలని ఆయన్నే అడగడమేంటి. ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేయాలని, ఒక కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్ ఇచ్చిన నివేదికపై, ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి. పెద్దఎత్తున హింసాకాండ చెలరేగినా సీఎస్‌ను ఎందుకు బాధ్యుడిని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అన్నీ వివాదాస్పద నిర్ణయాలే: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జవహర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదానికి తావిచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలో మూడు జిల్లాల కలెక్టర్లు, ఆరు జిల్లాల ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియామకాలకు మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లనే ఈసీకి పంపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశిస్తే ఏప్రిల్‌లో ఇంటింటికీ పింఛను పంపిణీని నిలిపేసి అందరూ గ్రామ సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేసి వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలున్నాయి. మే నెల వచ్చేసరికి ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. అనేక మంది వృద్ధులు అవస్ధలు పడ్డారు. వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్‌పై చర్యల్లేవు.
రైతులతోపాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన గుత్తేదారులకు దాదాపు 13 వేల కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చినవారికి ముందు చెల్లించే విధానాన్ని పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకూ సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ తేదీకి నాలుగైదు రోజుల ముందు 14 వేల 165 కోట్ల రూపాయల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. దిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదని ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ పది రోజుల క్రితం ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ తాత్సారం చేస్తున్నారు. సీఎం జగన్‌కు జవహర్‌రెడ్డి నమ్మిన బంటని, ఆయన సీఎస్‌గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా అనేక మంది ఈసీకి మొదట్లోనే ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది.
క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించిన సిట్ - కీలక రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం