Amaravati Construction Works : రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సమాయత్తమైంది. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే ఆ ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అమరావతిలో విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయలకు వెళ్లే రోడ్లను మొదటి విడతలో నిర్మించనున్నారు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటి కార్యాలయాలు ఏర్పాటవడంతో రైతులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయటమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పననూ పక్కన పెట్టారు. గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. అమరావతిపై కక్షతో అక్కడి ప్రజలను వైఎస్సార్సీపీ సర్కార్ విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ : ముందుగా సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌తో పాటు ఐఏఎస్ అధికారుల భవనాలు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులు పూర్తి చేయటానికి టెండర్లు పిలవనున్నారు. రాజధాని నిర్మాణ పనులకు ఇటీవల బడ్జెట్లో రూ.3000ల కోట్లు కేటాయించారు. పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయటంతో పాటు అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సీడ్ యాక్సెస్ రహదారికి అనుబంధంగా 32 రహదారులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడపడితే అక్కడ ఆగిపోయాయి. అలాగే రాజధాని ప్రాంతంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్శిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వెళ్లే రహదారుల పనులను ప్రారంభించింది.
సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు : అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించారు. వాటి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే అక్కడకు చేరుకునే రహదారులు పూర్తి చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ యంత్రాంగం వీటిపై దృష్టి సారించాయి. నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి నుంచి అన్ని పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధానిలో చేపడుతున్న పనులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. దీని కోసం 11 గ్రామాల్లో సీఆర్డీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. రాజధాని భూ సమీకరణ సమయంలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాల్ని జగన్ సర్కార్ తీసివేసింది. తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ అన్నదాతలను పట్టించుకునే వారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సీఆర్డీఏ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
AP Govt on Amaravati Works : అమరావతికి భూములు ఇచ్చిన కర్షకులకు కౌలు సకాలంలో అందిస్తున్నారు. కౌలుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను విక్రయించుకోవాలంటే రిజిస్ట్రేషన్లు కూడా వీటిలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అన్నదాతలకు మంచి సౌలభ్యం కల్పించినట్లయింది.
అమరావతి నిర్మాణ పనులు మొదలైతే ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రాజధానిలో పనిచేసే ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉంటారు. అలాగే నిర్మాణ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తారు. తద్వారా స్థానికులకు వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాలు పెరుగుతాయి. 2017-2019 మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి సందడి ఉండేదో అలాంటి వాతావరణం మళ్లీ కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయటంతో పాటు, మౌళిక వసతులు కల్పిస్తే అమరావతిలో పెట్టుబడులు రావటానికి మార్గం సుగమం అవుతుంది.
అమరావతి టవర్లకు మళ్లీ ఊపిరి - తొమ్మిది నెలల్లో మారనున్న రూపురేఖలు
ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం- కోటి ఆశలతో జనం