CRDA Plans to Start Works in Capital Amaravati: రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 15వ తేదీ నుంచి పనుల్ని పునఃప్రాంభించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించారు. నిర్మాణ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసేందుకు తీర్మానం చేసిన మంత్రి మండలి కొత్త టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది. దీంతో పనుల్ని మొదలు పెట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
ప్రభుత్వ భవనాల పనులు, ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై సీఆర్డీఏ ప్రణాళికలు చేసింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులకు చెందిన భవనాలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. వీటిని డిసెంబరు 15 నాటికి ప్రారంభించి 6 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. గ్రూప్, డీ, బీ, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జిలకు చెందిన బంగ్లాలను కూడా డిసెంబరు 15 నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని మొత్తం 9 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్దేశించింది. అలాగే ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి జోన్ 1 నుంచి జోన్ 6 వరకు డిసెంబరు 15 నుంచి అలాగే జోన్ 7 నుంచి జోన్ 12ఏ వరకూ డిసెంబరు 20వ తేదీ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ 24 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్దేశించింది.
"ఏపీలో మెగాసిటీ నిర్మాణం" - స్థిరాస్తి లేఔట్ అనుమతుల్లో సడలింపులు : మంత్రి నారాయణ
2025 జనవరి 1వ తేదీ నుంచి సచివాలయ టవర్లు, హైకోర్టు భవనాలు, జనవరి 30వ తేదీ నుంచి అసెంబ్లీ భవనాల నిర్మాణాలను మొదలు పెట్టనున్నారు. వీటిని 30 నెలల్లోగా పూర్తి చేయాల్సిందిగా సీఆర్డీఏ గడువు పెట్టుకుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వారికి ఇచ్చిన భూ కేటాయింపుల వద్ద కూడా నిర్మాణాలను 24 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. వాస్తవానికి సచివాలయ టవర్లు, శాశ్వత హైకోర్టు కాంప్లెక్స్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకూ 10-20 శాతం లోపు మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. మిగతా ప్రభుత్వ భవనాలకు 70-95 శాతం మేర పూర్తి అయ్యాయి.
రూ.16 వేల కోట్ల వ్యయం: అంచనా వ్యయంలో రూ.1531 కోట్ల రూపాయల్ని ఇప్పటికే చెల్లించారు. వాస్తవానికి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సంబధించిన పనుల్ని రూ.601 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలో 1281 కిలోమీటర్ల పొడవైన రహదారులు, వరద నీటి కాలువలు, డక్ట్లు, తాగునీరు, మురుగునీటి పారుదలకు డ్రెయిన్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికి రూ.16 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణ హామీ ఒప్పందం కుదరటంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.
ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం- కోటి ఆశలతో జనం
అమరావతి ఐకాన్ 'ధ్యాన బుద్ధ' ఒకప్పుడు కళకళ - వైఎస్సార్సీపీ హయాంలో వెలవెల