CPS Employees Union Leaders Are House Arrest by Police: ఛలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నా సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలపై పోలీసుల నిర్భందాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఎవరూ విజయవాడ రాకుండా నాయకులను శనివారం మధ్యాహ్నమే పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటన చేసినా అసోసియేషన్ నేతలను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికాంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ తెలిపారు.
'విజయవాడకు వస్తే అరెస్టే' సీపీఎస్ ఉద్యోగుల 'ఛలో విజయవాడ'పై ప్రభుత్వం ఉక్కుపాదం
ఆ హామీని అమలు చేయమని అడుగుతుంటే ఇలా ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం తమను పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారని చెప్పారు. ఛలో విజయవాడను వాయిదా వేశామని చెబుతున్న ప్రభుత్వం వినడం లేదన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి తమను పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని సీఎం జగన్ ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సీపీఎస్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఇచ్చిన హామీలను అడిగితేనే అంక్షలా - సీపీఎస్ ఉద్యోగులకు పోలీసుల నోటీసులు
సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అనకాపల్లిలో పోలీసులు ఉద్యోగులను ముందస్తు అరెస్టు చేశారు. ఏపీ సీపీఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, మాజీ అధ్యక్షులు అప్పలరాజులను శనివారం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చి రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. ఆదివారం ఉదయం పది గంటలకు స్టేషన్ నుంచి విడిచిపెట్టారు. తమపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పినా పట్టించుకోకుండా రాత్రంతా తమను స్టేషన్లో ఉంచడం పోలీసులకి, ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ సదస్సు - 'సీపీఎస్ రద్దు చేసే పార్టీకే ఓటు'
ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోతమోగిస్తున్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాత పెన్షన్ సాధనకు ఛలో విజయవాడకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. విజయవాడకు సీపీఎస్ ఉద్యోగులు వస్తారన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు ఇచ్చి ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.