Vizag Honey Trap Case Updates : ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్‌లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్‌గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. ఈ కోవలోకే విశాఖ ఘటన వెలుగులోకి రావడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
వలపు వలపన్ని పలువురిని మోసం చేసిన ఘటనలో మాయలేడి జాయ్ జమీమాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కిలేడీ జమీమా ఎత్తుగడలతో పాటు ఇతర కీలక అంశాలను వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన వారు, సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా నిందితురాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.
సామాజిక మాధ్యమాలే టార్గెట్ : సామాజిక మాధ్యమాల వేదికగా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని సీపీ శంఖబ్రత బాగ్చీపేర్కొన్నారు. ఈ జాయ్ హనీట్రాప్ వెనుక పెద్ద రాకెట్ ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. తొలుత అందమైన అమ్మాయి ఫొటోలతో యువకులకు ఎర వేస్తారని తెలిపారు. ఆ తర్వాత బాధితులను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తారని వివరించారు. ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీస్తారని సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.
ముఠా ఆ ఫోటోలను బాధితులకు చూపించి బెదిరిస్తారని సీపీ శంఖబ్రత బాగ్చీ వివరించారు. తమకు అడిగినంతా నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని చెప్పారు. దీంతో బాధితులు పరువు పోతుందన్న భయంతో వారు డబ్బులు చెల్లిస్తారని పేర్కొన్నారు. జాయ్ హనీ ట్రాప్‌లో చాలా మంది చిక్కుకున్నారని తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. కానీ వారు బయటకు రావడం లేదన్నారు.
విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు జాయ్ జమీనా ఈ ముఠాతో చేతులు కలిపిందని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలియజేశారు. నిందితురాలని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ ముఠా ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడిందో ఆరా తీస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.
హనీట్రాప్‌లో పడి కొకైన్ స్మగ్లింగ్.. అడ్డంగా బుక్కైన వ్యక్తి.. రూ.28కోట్ల డ్రగ్స్ సీజ్