Ap Government Plans To Control Vijayawada City Traffic Congestion : విజయవాడ నగర ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రింగు రోడ్డుగా మారే తూర్పు బైపాస్ నిర్మాణం అమరిక (Alignment)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అధికారులు సవివర నివేదిక పూర్తి చేశారు. ఇక భూసేకరణ ప్రారంభించడమే మిగిలింది. వచ్చే సంవత్సరం మార్చి లోపల టెండర్లు పిలిచి అప్పగించేలా సన్నాహాలు చేస్తున్నారు. కన్సెల్టెన్సీ సంస్థలు మూడు ప్రతిపాదనలను రూపొందించి ఎన్‌హెచ్‌ఏఐ(NHAI)కు అందించాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదానికి పంపినట్లు తెలిసింది. సీఎం పరిశీలించాక కేంద్రానికి పంపి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించనుంది. డిసెంబరులోగా టెండర్లు పిలిచే వీలుంది. డీపీఆర్(DPR) రూపొందించిన సంస్థలు రెండో ప్రతిపాదన అనువు అని సిఫార్సు చేసినట్లు తెలిసింది.
ప్రతిపాదనలు ఇవీ...
జాతీయ రహదారి-16 (చెన్నై-కోల్‌కత్తా) విస్తరణలో భాగంగా విజయవాడకు బైపాస్ రహదారి నిర్మిస్తున్నారు. ఇది నగరానికి పశ్చిమవైపు కృష్ణా నది మీదుగా వెళ్తుంది. ఈ ఎన్‌హెచ్-16 విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్, మహానాడు జంక్షన్, రామవరప్పాడు మీదుగా వెళ్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం సర్వీసు దారులూ లేకపోవడంతో ప్రమాదాలు చాలా పెరిగాయి. దీంతో రహదారి విస్తరణ కాజా నుంచి కృష్ణా నది మీదుగా గొల్లపూడి, నున్న మీదుగా చిన్నఆవుటపల్లి వరకు బైపాస్ నిర్మిస్తున్నారు. దీనికి వ్యతిరేక దిశలో ఒక బైపాస్ నిర్మిస్తే అనువుగా ఉంటుందని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. దీనికి జాతీయ రహదారుల సంస్థ సైతం అంగీకరించి, భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరింది. అనంతరం ప్రభుత్వం మారింది. తూర్పు బైపాస్‌కు కేడీఎం, చైతన్య కన్సల్టెన్సీ సంస్థలు సవివర నివేదిక (DPR)ను రూపొందించే బాధ్యత అప్పగించారు.
రెండో ప్రతిపాదనకు సిఫార్సు..
- కన్సెల్టెన్సీ సంస్థలు రెండో ప్రతిపాదన సిఫార్సు చేశాయి. అన్ని ప్రతిపాదనలు పొట్టిపాడు వద్ద ప్రారంభమై చినకాకాని వద్ద NH-16లో కలుస్తాయి. రెండు ప్రాంతాల్లోనూ జంక్షన్ నిర్మాణం సులువుగా ఉంటుందని ప్రతిపాదించాయి. రెండో ప్రతిపాదన ప్రకారం పశ్చిమ బైపాస్‌లోకి సులభంగా ప్రవేశించే వీలుంది.
- విజయవాడ నగరానికి కొంత దూరంగా ఉండటంతో భూసేకరణ వ్యయం తగ్గే వీలుంది. నగరానికి దగ్గరగా వచ్చిన కొద్దీ భూసేకరణ వ్యయం సైతం పెరుగుతుంది.
- విమానాశ్రయానికి దూరంగా అలైన్‌మెంట్ ఉండటంతో ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
- కృష్ణా నదిపై నిర్మించే వంతెన మొదటి, మూడో ప్రతిపాదనల కన్నా రెండో ప్రతిపాదనలో నిర్మించే దూరం (3.355కిమీ) తక్కువ.
- బందరు పోర్టు కనెక్టివిటీకి NH-65 నుంచి అనుసంధానం సులభంగా ఉంటుంది. మిగిలిన తొలి, మూడు ప్రతిపాదనల కంటే రెండో ప్రతిపాదనలో వంతెనల నిర్మాణం కేవలం 8 మాత్రమే ఉంటాయి.
- ఆర్వోబీల నిర్మాణం కూడా సులభంగా పూర్తి చేయవచ్చు.
అరమరిక ఇలా..!
తూర్పు బైపాస్ రెండు జిల్లాల్లో ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు మండలాల మీదుగా వెళుతుంది. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మంగళగిరి మండలాల మీదుగా చినకాకాని చేరుతుంది.
- కృష్ణా జిల్లాలో పొట్టిపాడు, ఆత్కూరు, పెదఅవుటపల్లి, చిన్నఅవుటపల్లి, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లి, మంతెన-1, ఉప్పులూరు, జగన్నాథపురం, మంతెన-2, పునాదిపాడు, గొడవర్రు, మద్దూరు, గోసాల, వణుకూరు మీదుగా కృష్ణా నది దాటుతుంది.
- గుంటూరు జిల్లాలో పెదకొండూరు, చినపాలెం, శృంగారపురం, తుమ్మపూడి, చిలువూరు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి, చినకాకాని గ్రామాల్లో భూసేకరణ చేయాలి.
- కృష్ణా జిల్లాలో 59.036 శాతం దూరం ఉంటే గుంటూరు జిల్లాలో 40.964 శాతం దూరం ఉంది. మూడు ప్రతిపాదల్లో రెండో ప్రతిపాదన ఖర్చు రూ.4,596.29 కోట్లు ఎక్కువ.
విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు.. పరిష్కారం చూపాలంటూ వేడుకోలు!
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం- బెజవాడలో భారీ ట్రాఫిక్ జామ్ - Heavy Traffic Jam at Vijayawada