Rain Water Holding Tanks in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో వాన పడితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోయి గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీంతో సామాన్య ప్రజలు, వాహనదారులకు తిప్పలు అన్నీఇన్నీ కావు. కాలంతో సంబంధం లేకుండా వర్షం పడిన ప్రతిసారి ఇదేతంతు కావడం అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారుతోంది. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు. అయినా సరే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
గతంలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలతో వరద సమస్యకు పరిష్కారం చేసినా 140 ప్రాంతాల్లో మాత్రం ఆ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ సమస్య కేవలం వర్షం కురిసినప్పుడు మాత్రమే వస్తుందని అనుకోవడం పొరపాటు మాత్రమే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
వరద నిలిచే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ రంగంలోకి దిగి వరద నీరు నిలిచే ప్రాంతాలను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఖైరతాబాద్ కూడలి, రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయ ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు.
భూగర్భ సంపుల నిర్మాణానికి ఆదేశం : కమిషనర్ ఆమ్రపాలి, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షించి వరద సమస్య పరిష్కారానికి భూగర్భ సంపులు, ఇంజక్షన్ బోర్‌వెల్స్ నిర్మించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జోన్‌కు 5 చొప్పున ప్రయోగాత్మకంగా భూగర్భ సంపులను నిర్మించాలని సూచించారు. దాన కిషోర్ ఆదేశాలతో వరద నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని జీహెచ్ఎంసీ సారించింది. ఆయా ప్రాంతాల్లో సంపుల నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు పిలిచి భూగర్భ సంపుల నిర్మాణానికి పనులు మొదలుపెట్టింది.
ప్రస్తుతం సచివాలయానికి ఎదురుగా భారీగా వర్షపు నీరు నిలిచే ప్రాంతంలో 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపును నిర్మిస్తోంది. అందుకు అవసరమైన ప్రదేశాన్ని గుర్తించి మట్టిని తవ్వుతున్నారు. అందులో ఇప్పటికే 150 అడుగుల లోతులో 4 ఇంజక్షన్ బోర్‌వెల్స్ వేశారు. వాటి ద్వారా వర్షపు నీటిని కట్టడి చేయడంతోపాటు సమీపంలో భూగర్భ జలాలు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రాజ్‌భవన్ రోడ్డులోని లెక్ వ్యూ గెస్ట్‌హౌస్, ఆర్టీఏ కార్యాలయం వద్ద భూగర్భ సంపు పనులు మొదలుపెట్టారు.
10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు : అటు ఐటీ కారిడార్‌లోని నెక్టార్ గార్డెన్ వద్ద కూడా 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపును నిర్మిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతంలో స్థలానికి అనుగుణంగా 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి సంపులను నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలోపు భూగర్భ సంపుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
అయితే నీటిని దారి మళ్లించేందుకు భూగర్భ సంపుల నిర్మాణం అంతగా ఫలించకపోవచ్చని జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు నిలిచే ప్రాంతం ఎగువన ఎంత వర్షం కురుస్తోందో అంచనా వేయలేమని, సంపు సామర్థ్యానికి మించి వరద వస్తే అవి తట్టుకోలేక మళ్లీ సమస్య పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శాంతించిన గోదారమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - Godavari Floods in Dhavaleswaram
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం - 51.4 అడుగులకు చేరిన నీటిమట్టం - BHADRACHALAM GODAVARI FLOODS