Conditional Bail to Jogi Rajeev in ACB Court : అగ్రిగోల్డ్ భూముల అవకతవకల కేసులో జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 25 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రతీ రెండో శనివారం ఏసీబీ కార్యాలయంలో సంతకం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని జోగి రాజీవ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. నిందితుడి నివాసముండే చిరునామాను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఏసీబీ అధికారుల విచారణకు సహకరించాలని తెలిపింది.
ఈ కేసులో నిందితుడ్ని తమకు వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. జోగి రాజీవ్ కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. సీఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించారని జోగి రాజీవ్, కొందరు అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా జోగి రాజీవ్ ఉన్నారు.
Attack Case on CM Chandrababu House: సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని జోగి రమేశ్ (Jogi Ramesh Case) కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దర్యాప్తు అధికారి ప్రశ్నలకు నిందితుడితో పాటు వెళ్లిన న్యాయవాది ఎలా సమాధానాలు చెబుతున్నారని పోలీసు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడ్ని అడిగిన ప్రశ్నలకు న్యాయవాది ఎలా సమాధానం చెబుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రశ్నలు విని డాక్యుమెంట్లు అందజేసే వరకే న్యాయవాది పాత్ర ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని ప్రశ్నిస్తుంటే న్యాయవాది సమాదానం చెప్పడంపై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు తెలిపిందని న్యాయస్థానం గుర్తు చేసింది.
జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండింది: మంత్రుల ధ్వజం - AP MINISTERS ON JOGI RAJEEV ARREST