Police Security Failure in Praja Galam: నిన్న టీడీపీ, బీజేపీ, జనసేన నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యంపై మూడు పార్టీల నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీతో పాటుగా పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు కల్పించారని కూటమి నేతలు పేర్కొన్నారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
తెరపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి: పల్నాడు ఎస్పీ, పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు నిర్ణయించాయి. మధ్యాహ్నం ప్రధాని ఎన్నికల అధికారిని కలిసి కూటమి నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు కల్పించటం, అధికారపార్టీ కి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదు చేయనున్నారు. ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయ నిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పల్నాడుఎస్పీ రవిశంకర్ రెడ్డి తెరపై కనిపిస్తున్నా, వెనక ఉండి ఆయనను నడిపించినవారు వేరే ఉన్నారని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన అంత దారుణంగా వ్యవహరించారని మండిపడుతున్నాయి.
నిన్నటి పరిణామాలపై తీవ్ర ఆగ్రహం: ప్రధానికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకూ సకాలంలో పాసులు ఇవ్వలేదు. మహిళా నేతలతో ప్రధానికి సన్మానం చేయించాలని మూడు పార్టీల నాయకులు వేసుకున్న ప్రణాళికకు గండికొట్టారు. నాగబాబు, మనోహర్ వంటి ముఖ్య నాయకుల్నీ వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మూడు పార్టీల నాయకులు, ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర సంస్థలకు ఫిర్యాదుచేసే యోచనలో ఉన్నారు.
మీ ప్రాణాలు ఎంతో విలువైనవి - స్తంభాల నుంచి దిగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి
పట్టించుకోని పోలీసులు: ప్రజాగళం సభలో రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉన్న గ్యాలరీలోనే వాటర్ బాటిల్ విసరడం, తోపులాటలు వంటి ఘటనలు చోటుచేసుకున్నా, పోలీసులు పట్టించుకోలేదు. వీఐపీ గ్యాలరీ ప్రవేశమార్గంలో తొక్కిసలాట జరగడం, వీవీఐపీ, మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకు వచ్చి, తోపులాటకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రజలు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేకమార్గాలు ఉన్నా పోలీసులు వారికి సరైన దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశమార్గం వద్దకు పంపారు.
ప్రధాని సభలోనూ పోలీసుల నిర్లక్ష్యం - అడుగడుగునా వైఫల్యం
లోపాలపై హెచ్చరించిన ఎస్పీజీ బృందాలు: ప్రధాని రావటానికి ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీజీ బృందాలు, సభ నిర్వహణలో బందోబస్తు పరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశారు. అప్పుడు పోలీసులు స్పందించలేదు. లైట్ల కోసం ఏర్పాటుచేసి టవర్ స్టాండ్ పైకి కొందరు కార్యకర్తలు ప్రమాదకరంగా ఎక్కారు. అది గమనించిన ప్రధాని మోదీ స్వయంగా వారిని ఉద్దేశించి, వెంటనే కిందకు దిగండంటూ వారించినా, పోలీసులు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఎన్నికల కోడ్ను పట్టించుకోని వైసీపీ నేతలు- ఏలూరులో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు