Compensation to Flood Victims in AP : భారీవర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీన పరిహారం అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి సాయం అందించనున్నారు. తమ పేరు నమోదు కాలేదనే ఫిర్యాదు ఒక్కరి నుంచి కూడా రాకూడదని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో విజయవాడలో వివరాల నమోదుకు కూటమి ప్రభుత్వం బాధితులకు మరో అవకాశం కల్పించింది.
అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి సాయం : వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టం గణన, పరిహారం చెల్లింపుపై చర్చించారు. 10 వేల వాహనాలు దెబ్బతినగా ఇప్పటికి 6 వేల వాహనాలకు బీమా చెల్లింపు పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా త్వరితగతిన అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా 25వ తేదీన పెట్టుబడి సాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. వరదకు దెబ్బతిన్న వారికి ఇచ్చే సాయాన్ని గతంలో నిర్ణయించిన మొత్తం కంటే భారీగా పెంచుతున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. వరదకు మునిగిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారికి 25వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లోని వారికి 10వేల చొప్పున సాయం అందించనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వనున్నారు.
ఆదుకోండి మహాప్రభు - సాయం కోసం రైతుల ఎదురుచూపులు - Crops Damaged By Heavy Rains
వివరాల నమోదుకు మరో అవకాశం : విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట గణన ప్రక్రియ నిర్వహించామన్న కలెక్టర్ సృజన నష్టం కలిగిన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. సచివాలయాల్లో ఎన్యుమరేషన్ జాబితాలను ప్రదర్శించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆయా సచివాలయాలను, ప్రత్యేక అధికారులను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆది, సోమవారాల్లో సచివాలయాల పరిధిలోనే వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. సోమవారం సాయంత్రం నాటికి తుది జాబితాలను రూపొందించి పంపించాలని ఇప్పటికే ఆయా వార్డుల ప్రత్యేక అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
మున్నేరు వరద మిగిల్చిన నష్టం - 50 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా - Drinking Water Schemes Damage