CM Jagan Dilemma in Pulivendula Constituency: సీఎం జగన్ కంచుకోట పులివెందులలో వైఎస్సార్సీపీకి ఎదురు గాలి వీస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి క్షేత్రస్థాయిలో ఓట్లు అడగకపోయినా, ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు ఆ కుటుంబానికి బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సారి ఎన్నికల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సతీమణి భారతి ఎన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులు, బంధువులను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఏళ్లుగా తమపై పులివెందుల ప్రజలు అభిమానం చూపుతున్నారని, ఈసారి కూడా భారీగా ఓట్లు వేసి జగన్‌ను గెలిపిస్తారని భారతి పలు సందర్భాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లుగా పులివెందుల ప్రజల నాడీ గతానికి భిన్నంగా ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జగన్ కుటుంబానికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రజలు ఎన్నడూ లేని విధంగా సమస్యలపై ఏకరవు పెడుతున్నారు. దీంతో వైఎస్సార్సీపీలో కలవరం మొదలైంది.
అడుగడుగునా ప్రజల నుంచి సమస్యలపై ఏకరవు: ఇటీవల ఓట్లను అభ్యర్థిస్తూ ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన సీఎం జగన్ సతీమణికి, వేంపల్లెలో వైఎస్సార్సీపీ కీలక నేత భాస్కర్‌రెడ్డి అడిగిన ప్రశ్న తీవ్ర ఇబ్బంది పెట్టింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రణపై ప్రస్తావిస్తూ ఒకింత నిలదీసినట్లు భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్న జగన్ నా రైతు కూడా అనాల్సిన పరిస్థితి ఉందంటూ, అన్నదాతను విస్మరించారనే విధంగా ప్రస్తావించారు. పులివెందుల ప్రచారంలోనూ పలు చోట్ల ప్రజలు తమ సమస్యలను భారతి వద్ద ప్రస్తావించారు. వ్యక్తిగత సమస్యలను నివేదిస్తూ అందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టలేదని ఎకరవుపెట్టారు.
చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లెలో సోమవారం భారతి ఇంటింటి ప్రచారానికి వెళ్లగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థులు ప్రస్తావించారు. భారతి పర్యటనలో ఉన్న నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి ప్రజలు తమ కష్టాలను భారతి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పక్కా ఇళ్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని భారతి ఎదుట కాలగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సారికి ఓటేస్తే అన్ని చేయిస్తామంటూ వైసీపీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వారి వైపు తిరిగి మరింత తీవ్ర స్వరంతో వృద్దురాలు మాట్లాడారు. తమ కుటుంబ కష్టాలు గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారతి జోక్యం చేసుకుని పింఛను వస్తోందా? అవ్వా అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. మావాళ్లు తప్పకుండా ఇళ్లు కట్టిస్తారంటూ హామీ ఇచ్చి వెనుదిరిగారు.
కావలి సుభాషిణి అనే మహిళ భారతితో మాట్లాడుతూ ఇంటికోసం 12 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్న పాటి బోదకొట్టంలో జీవనం సాగిస్తున్నామంటూ దాన్ని చూపించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నా ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని, భర్త ఆటో నడుపుకొంటున్నప్పటికీ ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ ప్రస్తావించారు. తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేసుకునేందుకు మార్గం కనిపించలేదని విలపించారు.
గోడకూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుము విరిగిపోయిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓబులశెట్టి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇలాంటి నిలదీతలు, సమస్యలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాల్లేవు. ఈసారి మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ధైర్యంగా తమ ఇబ్బందులను ప్రస్తావించడం వైసీపీ నేతల్లో ఒకింత అసహనాన్ని పెంచుతోంది.
అన్నతో ఢీ అంటున్న ఇద్దరు చెల్లళ్లు: దీంతోపాటు గత ఎన్నికల వేళ సంచలనం రేపిన వివేకా హత్య కేసులో పరిణామాలు జగన్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. గత ఎన్నికల్లో ఈ ఘటనను చంద్రబాబుపై నెట్టి, ఎన్నికల్లో జగన్ లబ్ది పొందారనే వాదన నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లుగా కనిపిస్తోంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల సైతం వివేకా హత్య అజెండాపైనే కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగారు. వివేకా కుమార్తె సునీత గ్రామాల్లో తిరుగుతూ ప్రజాకోర్టులో న్యాయం కావాలని వేడుకొంటున్నారు. షర్మిల, సునీత కొంగు చాచి న్యాయం, ధర్మం కావాలంటూ, దీనికి ప్రజల మద్దతు కోరుతున్నారు. అటు రాజన్న బిడ్డ షర్మిల, ఇటు వివేకా తనయ సునీత కొంగు చాచి అనేంత పదాలు వాడడం ప్రజల మనసులను కదిలించాయి.
ఈ పరిణామాలతో జగన్ కుటుంబం ఈ ఎన్నికలపై మరింత జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆర్థికసాయం ఆశించేందుకు ఓ దరఖాస్తు సైతం రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. భారతి పర్యటనలో పోలీసులు, అనుచరులు నిలదీతలు తగ్గించడానికి ఓ వైపు కృషి చేస్తుంటే నియోజకవర్గంలో పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చోట్ల డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారు. ఉద్యోగులు చాలా మంది తాయిలాలను తిరస్కరించడం వైఎస్సార్సీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
వివేకా హత్య కేసు ప్రభావం: పులివెందుల నియోజకవర్గ ప్రజలు మాజీమంత్రి వివేకానందరెడ్డిని అమితంగా ప్రేమిస్తారు. ఏ చిన్న సమస్యనైనా చెప్పుకొంటే వెంటనే వారిని వాహనంలో అధికారి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే నైజం ఆయనది. దీంతో నియోజకవర్గంలో ఏ సమస్యనైనా పరిష్కరించడంతో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు. ఆయన మరణంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారు. సీఎం జగన్ వచ్చినా సొంత నియోజకవర్గంలోనూ పరదాల చాటున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆయనను కలవాలంటే ముందస్తుగా పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి. పాసులు పొందడం అంత సులువు కాదు. వివేకా హత్య జిల్లాతో పాటు నియోజకవర్గంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీబీఐ విచారణ, ఛార్జిషీట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనంలో పెద్ద చర్చ నీయాంశమైంది.