CM Chandrababu Towards Investments: ఓవైపు అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని వేగవంతం చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. గతంలోనే రాష్ట్రంలో ఉన్న వనరులు, పరిశ్రమల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు.. తాజాగా మరోసారి చర్చించారు. గత పాలనలో కియా, అమర్‌రాజా సహా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. మరెన్నో పరిశ్రమలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అయితే ప్రభుత్వం మారిన తరుణంలో వేధింపులు తాళలేక రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో బీపీసీఎల్ ప్లాంటు రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మచిలీ పట్నంలో ఉన్న అవకాశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. బీపీసీఎల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన అధికారులు.. చర్చల సారాంశాన్ని సీఎం చంద్రబాబు ముందుంచారు. తుది చర్చల అనంతరం రిఫైనరీ ఏర్పాటుపై స్పష్టత రానుంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ విద్యాసంస్థలు, కార్పొరేట్, బిజినెస్ రంగాల్లో పరిణామాలన్నింటినీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ముంబై, దిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల వ్యవహారాల వార్తలను రిపోర్ట్ చేసే జాతీయస్థాయి వార్తాపత్రికలను రోజూ ఉదయం తన డ్యాష్‌బోర్డులో పెట్టాలని నిర్దేశించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సీఎం భావిస్తున్నారు. ఏవైనా పెద్ద సంస్థలు వాటి విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే ఆ సమాచారం ముందుగానే తెలుసుకుని వారితో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేది సీఎం వ్యూహం.
అందులో భాగంగా అధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. పెట్టుబడులకు ఏపీ అనువైన కేంద్రమనే ముద్రను కార్పొరేట్ రంగంలో వేసి, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించొచ్చని సీఎం భావిస్తున్నారు. విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడం, అధికార యంత్రాంగం ప్రక్షాళన, పార్టీ కార్యకర్తలకు, నేతలకు సమయమివ్వడం వంటి కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు.