CM Chandrababu Review on Panchayati Raj Rural Development Department : సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహా ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ శాఖను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. 2014-19 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
2025 జనవరి నుంచి జన్మభూమి-2 కార్యక్రమం : ప్రతీ ఇంటికీ, గ్రామానికి ప్రాంతానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమో గుర్తించి తగిన కార్యాచరణ చేపడతామన్నారు. విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు నీటి కుళాయి లాంటి వాటిని అందించేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలన్నారు. అలాగే ఒక గ్రామానికి అవసరమైన వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.
గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెటింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. 2025 జనవరి నుంచి జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ నిధులు విడుదల : వచ్చే ఐదేళ్లలో 17వేల500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. 10 వేల కిలోమీటర్ల సీసీ డ్రైనేజీ కాలువల నిర్మాణం జరపాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయన్నారు. దీని వల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖనుంచి విడుదల చేస్తున్నామన్నారు.
జల్‌జీవన్ మిషన్‌కు నిధులు : ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జల్‌జీవన్ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ సర్పంచ్‌ని గౌరవించుకోవాల్సిన అసవరముందన్నారు.
23వ తేదీన గ్రామ సభలు : గత ప్రభుత్వ తీరువల్ల మూలనపడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎం చెప్పారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నిటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం : రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాల్సిందిగా సీఎం వెల్లడించారు. ఉద్యాన పంటలతో కలిపి రాష్ట్రంలో 50 శాతం మేర గ్రీన్ బెల్ట్ లక్ష్యం సాధించాలని సీఎం స్పష్టం చేశారు. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలని సీఎం తెలిపారు. పచ్చదనం పెంచితే ప్రజలు ఆ ప్రాంతాలకు వచ్చి సేద తీరుతారని అలాంటి వాతావరణం కల్పించాలని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయని ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. డిపోల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిరక్షిచాలని 6 నెలలకు ఒక్క సారి వేలం నిర్వహించాలన్నారు. మడ అడవుల అభివృద్ధి, పరిరక్షణ కోసం రాజీ లేకుండా పనిచేయాలని సూచించారు.