CM Chandrababu Review on Industries Department: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదు నూతన విధానాల రూపకల్పనకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నాలుగు చోట్ల పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సమీక్షలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరల తగ్గింపుపై సమీక్షించారు.
పారశ్రామిక వేత్తలతో చర్చలు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం సహకరించక పోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడడంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా వివిధ కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల కబ్జాలు అయ్యాయని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం విడిచి పోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామికవేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడుతానని చెప్పారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత ఏ ఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌కు అనుకూలం అనే అంశాలపై చర్చించారు. మంత్రులు టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్ సమీక్షకు హాజరైయ్యారు.
25 వెంచర్లకే అధికారిక అనుమతులు- వెలిసింది వెయ్యికి పైగా లేఅవుట్లు! - ILLegal Layouts in Kadapa
Industries Minister TG Bharat Press Meet: పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా అత్యుత్తమ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారని 5 నూతన విధానాల రూపకల్పనకు ఆదేశించారని తెలిపారు. కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో నూతన పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించారని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని వీడిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి వెనక్కి తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించినట్లు వివరించారు.
మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల ధరలను వైసీపీ పాలకులు విచ్చలవిడిగా పెంచేయడంతో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. పెట్టుబడులను ఆకర్షించేలా భూముల ధర తగ్గింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అన్నట్లు తెలిపారు. విశాఖ, చిత్తూరు నోడ్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 75 వేల కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ సంస్థ రాబోతోందని అలాగే విన్‌ఫాస్ట్ సంస్థ సీఎంతో చర్చలు జరిపిందని మంత్రి భరత్ వెల్లడించారు.
అమెరికా కాన్సులేట్ జనరల్‌తో భేటీ: రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో జెన్నిఫర్ లార్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివరించినట్లు మంత్రి భరత్ పేర్కొన్నారు. అమెరికాలో తెలుగువాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలని కోరానన్నారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
విడిపోయిన దంపతులు- తండ్రితో మాట్లాడిందని కుమార్తెకు వాతలు పెట్టిన తల్లి
సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్- అధికారులతో సమీక్షలు