CM Chandrababu Review on Employement and Sports: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో కల్పించేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే యువతలో నైపుణ్యాలు పెంచటంతో పాటు ఇంటి వద్ద పనిచేసేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. యువజన సర్వీసులు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు.
ఉద్యోగ, ఉపాధి కల్పనకు యాక్షన్ ప్లాన్: నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్దనుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. విజయవాడలో వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం అన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు కలిసి ఈ పనిచేయాలని సీఎం అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్‌తో రావాలని అధికారులకు సీఎం సూచించారు.
క్రీడా రంగానికి ప్రోత్సాహం: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం ఆదేశించారు. గతంలో టీడీపీ హయాంలో కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాల పూర్తి చేసేందుకు రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముందుకు వస్తే వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని సూచించారు. 2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ రూపకల్పన చేయాల్సిందిగా సూచించారు. తిరుపతి, అమరావతి, విశాఖలను క్రీడా హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన ప్రాజెక్ట్ గాంఢీవ, ప్రాజెక్ట్ పాంచజన్య, ప్రాజెక్ట్ విజయ, డే బోర్డర్స్, స్పోర్ట్స్ నర్సరీస్ లాంటి కార్యక్రమాల్ని పునరుద్ధరించాలని సూచించారు. అన్ని స్టేడియాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో స్పొర్ట్స్ సెంటర్లు: 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా అకాడేమీల ఏర్పాటుకు భూమి తీసుకున్న వారితో సంప్రదించి వెంటనే వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. ఆసక్తిచూపని వారి నుంచి భూములు వెనక్కు తీసుకోవాలన్నారు. అమరావతిని క్రీడానగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చిన్న పాటి స్పొర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
టీడీపీ కార్యాలయంపై అటాక్ కేసు - దాడి చేసిన వారికి డబ్బులు - TDP Central Office Attack Case