Chandrababu on Fengal Cyclone : ఫెంగల్ తుపాన్పై విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం పేర్కొన్నారు.
అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. తుపాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. తుపాన్పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Heavy Rains in AP : మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వద్ద, కారైకాల్-మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ వివరించింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది.
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో తుపాను - రాష్ట్రంలో భారీ వర్షాలు