No Traffic Restrictions in Chandrababu Tour : గత ప్రభుత్వంలో సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు రోడ్లపై పరదాలు దర్శనమిచ్చేవి. పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడితేనే ఆయన కాలు బయట పెట్టేవారు. సామాన్య ప్రజలకు పోలీసులు చుక్కలు చూపించేవారు. వ్యాపారులను ఆ రోజంతా దుకాణాలు మూసి వేయాలని బెదిరింపులకు గురిచేసేవారు. ముందస్తుగానే ఆ ప్రాంతంలోని ప్రతిపక్ష నేతలను గృహ నిర్భధంలో ఉంచేవారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై తిరిగి కేసులు నమోదయ్యేవి.
దీనికితోడూ జగన్ పర్యటనలో వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. అదేెంటో విచిత్రం గాల్లో ఆయన ప్రయాణించినా అవే రూల్స్ విధిస్తారు. ముఖ్యమంత్రి వస్తుంటే, ఒక్కరోజు సహకరించలేరా అంటూ పోలీసులు, ఆ పార్టీ నాయకులు జనంపై రుసరుసలాడుతారు. ప్రజలు నెత్తీనోరు బాదుకున్నా ఆ మార్గంలో అనుమతించరు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయన పర్యటనల పేరిట జనాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఎవరేమనుకుంటే మాకెంటి అని దులిపేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్యని చెప్పవచ్చు. చివరకు జగన్ సభలకు వచ్చే వారికి సైతం నల్ల దుస్తులు వేసుకుని రావద్దని నిబంధన పెట్టడం నాడు పెద్ద దుమారమే రేగింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
రోజు ఇదే పద్ధతి పాటిస్తున్న సీఎం కాన్వాయ్ : కానీ ప్రస్తుతం సీన్ మారింది. విజయవాడలోని వరదముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోంది. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాలను నిదానంగా దాటుకుంటూ ఎక్కడా పోలీసుల హడావుడి లేకుండా ముందుకు వెళ్తోంది. వరద ప్రాంతాల్లో సామాన్య అధికారి మాదిరిగానే గత 10 రోజులుగా ఆయన నగరంలోనే ఉంటూ నిర్విరామంగా తిరిగారు. రోజూ ఇదే పద్ధతిని పాటించారు. గతంలో జగన్ పర్యటనలను చూసి విసిగి వేసారిన ప్రజలు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకపోవడంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.