Chandrababu in Unstoppable Season 4 : ‘చనిపోతే ఒకే ఒక్క క్షణం ఆశయం కోసం పనిచేస్తే అదే శాశ్వతం. చావు గురించి ఆలోచిస్తే ఏదీ చేయలేం. దేన్నైనా సరే ముందుకెళ్లి ఎదుర్కొందామని అనుకున్నా’ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు తన మనసులో మెదిలిన భావాలివే అని సీఎం చంద్రబాబు తెలిపారు. కారాగారంలో నిరంతరం అనేక సందేహాస్పద ఘటనలు జరిగాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవటంతో తన జోలికి ఎవరూ రాలేకపోయారని పేర్కొన్నారు. తాను అలా లేకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవటమే కష్టంగా ఉందని, చరిత్రే మరో మాదిరిగా ఉండేదేమోనని వ్యాఖ్యానించారు.
జైలు నుంచి విడుదలై ఇంటికొచ్చాక కూడా ఆ ఘటనలన్నీ నిరంతరం తన మనసులో తిరిగేవని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్‌స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ప్రసారమైంది. ఈ సందర్భంగా తన అరెస్ట్, జైల్లో గడిపిన రోజులు, పవన్ కల్యాణ్‌తో పొత్తు తదితర అంశాలపై బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
లక్ష్మణ రేఖ దాటను - తప్పు చేసిన వారిని వదలను : 'నా అరెస్ట్ ఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. నేనెప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులా బతికాను. తప్పకుండా ప్రజలు మద్దతిస్తారనే విశ్వాసంతో ఉన్నా. ఆ నమ్మకమే మళ్లీ నన్ను గెలిపించింది. నన్ను ప్రజల ముందు ఇలా నిలబెట్టింది. అరెస్ట్ చేస్తారనో, ప్రాణం పోతుందోనని భయపడితే అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చలేం. నా జీవితంలో ఎన్నడూ రాజకీయ కక్షతో వ్యవహరించలేదు. గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత రాజశేఖరరెడ్డి శాసనసభలో గొడవలు చేస్తూ రెచ్చిపోయినా సంయమనం పాటించేవాణ్ని. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్ష నేతగా ఉన్న నాపై దూకుడుగా మాట్లాడితే హెచ్చరించేవాణ్ని. ఆయనే తగ్గి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా కక్షపూరిత రాజకీయాలు వచ్చాయి. వ్యక్తిగత ద్వేషాలకు తెరలేపారు. అయినా సరే నేను లక్ష్మణరేఖ దాటను. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను. తప్పు చేయనివారి జోలికి వెళ్లను' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నన్ను అరెస్ట్ చేయకున్నా పొత్తు ఉండేదేమో! : ‘పవన్ కల్యాణ్ జైల్లో నన్ను కలిసి ‘ధైర్యంగా ఉన్నారా?’ అని అడిగారు. నా జీవితంలో ఎప్పుడూ అధైర్యంగా ఉండనని, దేనికీ భయపడనని చెప్పాను. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు చూస్తున్నానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రయత్నిస్తానని నాతో ఆయన అన్నారు. అలాంటప్పుడు అందరం కలిసి పోటీ చేద్దామని దానిపై ఆలోచించాలని నేను ప్రతిపాదించా. పవన్ కల్యాణ్ వెంటనే దానికి అంగీకరించారు. బీజేపీకి కూడా నచ్చజెప్పి పొత్తులోకి తీసుకొస్తామన్నారు. అదే విషయాన్ని నన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చి మీ (బాలకృష్ణ)తో, లోకేశ్‌తో కలిసి విలేకర్లకు వెల్లడించారు. మా విజయానికి అదే మొదలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘మిమ్మల్ని అరెస్ట్ చేయకపోయి ఉంటే మీ మధ్య ఈ పొత్తు ఏర్పడేదా?’ అని బాలకృష్ణ ప్రశ్నించగా ‘అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ ఆ నిర్ణయానికి ఊతమైంది. ప్రజల ఆకాంక్షను సరైన సమయంలో పవన్ కల్యాణ్ ప్రతిబింబించారు. మనం నిమిత్తమాత్రులం. విధి స్పష్టంగా ఉంటుంది’ అని చంద్రబాబు సమాధానమిచ్చారు.
నైతిక స్థైర్యం కోల్పోకూడదనే :
- రాజమహేంద్రవరం జైల్లోకి అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు. నేను చేయని తప్పునకు ఈ శిక్షేంటి అని ఆ రాత్రంతా ఆలోచించా. నేను నైతిక స్థైర్యం కోల్పోతే ఇక ఏమీ ఉండదని ఆలోచించి ధైర్యంగా ఉన్నా. నన్ను శారీరకంగా దెబ్బతీయలేక మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు.
- నేనెప్పుడూ కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేదు. తెలుగుజాతి, దేశం బాగుండాలనే పనిచేశా. నా కోసం పోరాడుతున్న ప్రజల కోసం నా శేష జీవితం అంకితం చేయాలని జైల్లో ఉన్నంత కాలం ఆలోచించేవాణ్ని.
- చాలా మంది నేతల్ని వారు మరణించిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఒక నాయకుడికి కష్టం వస్తే ప్రజలు ఎంత తీవ్రంగా స్పందిస్తారనేదానికి నా అరెస్ట్ అనంతర ఘటనలే నిదర్శనం.
వెంకన్నను అదొక్కటే కోరుకున్నా : జైల్లో నేను గడిపిన రోజుల గురించి పుస్తకాలు రాయొచ్చు. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఒక్కోసారి కొందరికి పరీక్షలు ఎదురవుతుంటాయి. అలాంటిదే నాకు వచ్చిందనుకున్నా. దాన్ని ఎదుర్కొనే దృఢ సంకల్పమివ్వాలని నా ఇష్టదైవం వేంకటేశ్వరస్వామిని ప్రతి క్షణం ప్రార్థించేవాణ్ని.
నేను జైల్లో ఉన్నప్పుడు లోకేశ్‌నూ ఇబ్బంది పెట్టారు : నేను జైల్లో ఉంటే నా సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. ఆ సమయంలో నాటి సర్కార్ లోకేశ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. నాకు జరిగిన అన్యాయంపై బయట ప్రజలు పోరాడుతుంటే వారికి నా కుటుంబ సభ్యులే నాయకత్వం వహించారు. భువనేశ్వరి ఒక సీఎం కుమార్తెగా, ఒక ముఖ్యమంత్రి భార్యగా ఉన్నా ఎన్నడూ రాజకీయాల్లోకి, బయటకు రాలేదు. అలాంటిది నా కోసం పగలూ రాత్రీ ప్రజల్లోనే ఉంటూ పోరాడారు.
యువగళం - లోకేశ్ జీవితంలో టర్నింగ్ పాయింట్ : లోకేశ్ రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర టర్నింగ్ పాయింట్. దానికి ముందు, తర్వాత లోకేశ్ వేరు. పాదయాత్ర చేయాలన్నది లోకేశ్ నిర్ణయమే. అయితే విద్వేషాలతో నిండిపోయిన సర్కార్ ఉన్నప్పుడు పాదయాత్ర అంత సజావుగా జరగదేమోనని, పాలకులు దేనికైనా తెగబడతారేమోనని అనుమానించాను. లోకేశ్ మాత్రం పాదయాత్ర చేసి తీరాలని పట్టుబట్టాడు. ఎన్టీఆర్‌కి మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా, బాలయ్య అల్లుడిగా కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకత కావాలని, తనను తాను నిరూపించుకుంటానని వెళ్లాడు. ప్రజల కోసం పోరాడతానని చెప్పి వెళ్లి, తానేంటో నిరూపించుకున్నాడు.
అమరావతి, హైదరాబాద్ అగ్రశ్రేణి నగరాలుగా ఉండాలి : అమరావతి కల గురించి చెప్పండన్న ప్రశ్నకు ‘దాన్ని ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సైబరాబాద్ నిర్మాణంలో చేయలేనివి అమరావతిలో చేస్తున్నాం. ఇంటింటికీ పైప్‌ల ద్వారా ఏసీ సదుపాయం కల్పించే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌కు వాతావరణం, ప్రభుత్వ భూములు ఉండటం అడ్వాంటేజ్ అయితే అమరావతికి కృష్ణా నది, కొండలు కలిసొస్తాయి. ఈ రెండు నగరాలు దేశంలో నం.1, 2లుగా ఉండాలన్నది నా ఆకాంక్ష’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మనవడు దేవాంశ్ ప్రశ్నలకు తాత జవాబులు : మనవడు దేవాంశ్ తెరపై కనిపించి చంద్రబాబును కొన్ని ప్రశ్నలడిగారు. దానికాయన ముసిముసి నవ్వులతో సమాధానమిచ్చారు. ‘మీరు ఎప్పుడూ రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు కదా, తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?’ అన్న ప్రశ్నకు ‘నువ్వు టైం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్సయ్యేవాణ్ని. కానీ ఇప్పుడు నువ్వు టైం ఇవ్వట్లేదు కదా? నువ్వు ఎప్పుడూ లెక్కలతో కుస్తీ పడుతుంటావు. అది బోర్ కొడితే సైన్స్ చదువుతూ రిలాక్సవుతావు. నాక్కూడా చేస్తున్న పని మార్చుకుంటే రిలాక్సేషన్ వస్తుంది’ అని ఆయన బదులు ఇచ్చారు.
- ‘ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ కనిపించదు. అదేంటి?’ అని దేవాంశ్ పొడుపు కథ అడిగితే ‘భవిష్యత్త్’ అని చంద్రబాబు బదులిచ్చారు.
- ‘మీరు చేసిన మోస్ట్ అల్లరి పనేంటి’ అని దేవాంశ్ ప్రశ్నించగా చంద్రబాబు బాలయ్యను ఉద్దేశించి ‘కాలేజీ రోజుల్లో నీ చిలిపి చేష్టల గురించి తెలిసి ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నట్టున్నాడు’ అంటూ తప్పించుకున్నారు. దానికి బాలయ్య స్పందిస్తూ ‘వీడు తెలిసి అడుగుతున్నాడో, తెలియక అడుగుతున్నాడో గానీ పొలిటీషియన్ అవుతాడేమోనని నా డౌట్’ అని వ్యాఖ్యానించారు.
పప్పు బ్రహ్మాండంగా చేస్తా - ఆమ్లెట్ వేస్తా : షోలో భాగంగా బాలయ్య రెండు చొప్పున ఆప్షన్లు ఇస్తూ వాటిలో ఏది ఇష్టం అంటూ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబును మీకు వంట వచ్చా అని బాలయ్య అడగ్గా, నీకు వచ్చా అంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. తనకు వంట రాదు గానీ, సలహాలు మాత్రం బాగా ఇస్తానని బాలయ్య చెప్పారు. తాను పప్పు బ్రహ్మాండంగా చేస్తానని, ఆమ్లెట్ ఈజీగా వేస్తానని, అవి తప్ప ఇంకేమీ రావని చంద్రబాబు పేర్కొన్నారు.
కుదిరితే భువనేశ్వరితో కప్పు కాఫీ : టీ, కాఫీల్లో ఏది ఇష్టం అన్న ప్రశ్నకు రోజూ ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య ఒక కాఫీ తాగుతానని చంద్రబాబు బదులిచ్చారు. ‘హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నప్పుడు భువనేశ్వరితో కలసి తాగుతాను. అమరావతిలో ఉంటే డైనింగ్ టేబులే నాకు తోడు. ఆమె హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎప్పుడో గానీ కలసి కూర్చునే అవకాశం రాదు. అలాంటి సందర్భం వస్తే అదే మాకు పెద్ద పండుగ’ అని చెప్పారు. విజయవాడ, విశాఖల్లో ఏ నగరం ఇష్టం అన్న ప్రశ్నకు తన ఛాయిస్ అమరావతి అంటూనే విశాఖ, విజయవాడ రెండింటినీ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వివరించారు.
ఔను అన్నీ సవాళ్లే! : ‘ఎన్నో ఆశయాలు, సంకల్పంతో ఏదో సాధించాలని అధికారంలోకి వచ్చారు. ఖాళీ ఖజానా, నిర్వీర్యమైన వ్యవస్థ, విజయవాడలో వరదలు మీకు సవాళ్లు కాదా’ అన్న ప్రశ్నకు ‘సవాళ్లే. ఒకపక్క అప్పులు తీర్చాలి, వడ్డీలు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. పారిశ్రామికవేత్తలు చెల్లాచెదురైపోయారు. అమరావతి నిర్వీర్యమైపోయింది. వాటన్నింటినీ గాడిలో పెట్టడం సవాలే’ అని తెలిపారు.
వరదల్లో ఆ తండ్రి వేదన చూసి చలించిపోయాను : వరదలు వస్తే హెలికాప్టర్‌లో తిరిగే నేతలున్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ బాలకృష్ణ ప్రశంసించగా ‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. అందుకే బోటు ఎక్కి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లాను. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని, బోటులో వెళ్లొద్దని భద్రతా సిబ్బంది చెప్పినా పట్టించుకోలేదు. నేను వెళ్లి చూస్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయని ముందుకు వెళ్లాను. అక్కడి తీవ్రత అర్థమయ్యాక కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడే బస్సులో పదిరోజులు బసచేసి వరద సహాయ చర్యల్ని పర్యవేక్షించాను.
ఒక తండ్రి నా దగ్గరకు వచ్చి మూడు రోజుల నుంచి పిల్లాడు నీళ్లు అడుగుతున్నాడని, రెండు బాటిళ్ల నీళ్లు ఇప్పించాలని అడిగితే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎన్ని మార్గాలుంటే అన్నీ ఉపయోగించి ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు అందజేశాం. బిస్కట్లు, భోజన పదార్థాలు, పాలు, పళ్లు ఏది దొరికితే అది పంపించాం. జీవితంలో ఎప్పుడూ చేయనంత శ్రమ చేశాం. పది రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి.
నాకు భువనేశ్వరి బాస్ - లోకేశ్‌కి బ్రాహ్మణి బాస్ : తెరపై భువనేశ్వరి, బ్రాహ్మణి ఫొటోలు చూపించిన బాలకృష్ణ వారిద్దరిలో మీకు ఎవరు బాస్ అని ప్రశ్నించగా చంద్రబాబు నవ్వుతూ ‘నాకు భువనేశ్వరి బాస్, మా అబ్బాయికి బ్రాహ్మణి బాస్’ అని బదులు ఇచ్చారు. బాసిజం చేయాలని వారికి తామే శిక్షణ ఇచ్చి పంపించామని బాలకృష్ణ అనగా వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా మీరే చెప్పాలంటూ చంద్రబాబు చమత్కరించారు. ‘నేను తట్టుకోలేకే మీ ఇంటికి పంపించాను’ అని బాలకృష్ణ నవ్వుతూ బదులిచ్చారు. తమ కుటుంబానికి బలం వారేనని చంద్రబాబు వెల్లడించారు.
స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నా : చంద్రబాబు