CM Chandrababu Instructions to Ministers : మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ ఏడుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కేబినెట్ భేటీలో వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తమకన్నీ తెలుసన్న భావన వీడాలని హితబోధ చేశారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వద్దని, సమష్టిగా నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పేషీల్లో వివాద రహితుల్ని, మంచి నడవడిక ఉన్నవారినే అధికారులు, సిబ్బందిగా నియమించుకోవాలన్నారు. కొందరు పార్టీలు, కులాల పేరుతో అంతరాలు పెంచేందుకు ప్రయత్నిస్తారని వాటిని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు.
సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తూ, అభివృద్ధికీ పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారీ ఖర్చుతో పెద్ద పెద్ద సభలు నిర్వహించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరితే చాలన్నారు. చిన్న సమావేశాలైతే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ప్రజా జీవితంలో ఉన్నామని నిరంతరం గుర్తుంచుకోవాలని ఎవరూ అభ్యంతరకర భాష వాడొద్దని హెచ్చరించారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని రెండు విభాగాలుగా చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివి వెంటనే నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ఉన్న వాటికి గడువు పెట్టుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులపై అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడటం వంటివి చేయవద్దని మంత్రులకు హితబోధ చేశారు. ఎంపీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్రం మద్దతుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
పోలవరంపై చర్చ సందర్భంగా ఆ ప్రాజెక్టుని ఎప్పటిలోగా పూర్తి చేయగలమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించగా దానిపై అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక వచ్చాకే ఒక అంచనాకు రాగలమని చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్ల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది భవన నిర్మాణ కార్మికులు కాబట్టి క్యాంటీన్‌లు పునఃప్రారంభించే కార్యక్రమంలో వారిని భాగస్వాముల్ని చేయాలన్న సూచన మంత్రివర్గ సమావేశంలో వచ్చింది. క్యాంటీన్ల నిర్వహణకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు.
టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై నెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 1994 నుంచి ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే డీఎస్సీలో 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అయ్యాయని సమావేశంలో చర్చకు వచ్చింది. పింఛను మొత్తం పెంచాలన్నా, ఉద్యోగాలివ్వాలన్నా చంద్రబాబే గుర్తొస్తారని కొందరు మంత్రులు కొనియాడారు.