Chandrababu on Tirupati Laddu Controversy : తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిని చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాముడు తల తీసేస్తే దిక్కులేదని, అంతర్వేది రథం తగలపెడితే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా? : తిరుమల శ్రీవారి విషయంలో తాను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని చంద్రబాబు తెలిపారు. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే పనులు పొరపాటున కూడా చేయమని చెప్పారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకూ ఉందని పేర్కొన్నారు. అలాగని చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ తాము కనిపెట్టిన ఫార్ములా కాదన్నారు. తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉందని చంద్రబాబు వెల్లడించారు.
ఎన్నో దేవాలయాలు తిరుమల లడ్డూ రుచిని యథాతథంగా తీసుకొచ్చేందుకు విఫలయత్నాలు చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంట్లో స్వామివారి లడ్డు ఉంటే ఇళ్లంతా ఘుమఘుమలాడే వాసన వచ్చేదని గుర్తు చేశారు. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయటమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని నిలదీశారు. ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అని ప్రశ్నించారు. స్వామి వారి అన్న ప్రసాదం స్ఫూర్తితోనే అన్న కాంటీన్లు పెట్టామన్నారు. అంతకుముందు ఆయనప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
టీటీడీ అత్యవసర సమావేశం : ఈ నేపథ్యంలోనే శనివారం లడ్డూ అపవిత్రంపై టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో నివేదికగా కీలకంగా మారింది. శనివారం సాయంత్రం ఆయన చంద్రబాబును కలవనున్నారు. ఈవో నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ వ్యవహారంపై ఆగమ, వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ కూడా అప్రమత్తమైంది.