Clap Auto Drivers Problems in AP : వాళ్లంతా క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన రథసారథులు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ మన వీధిలోకి, ఇంటి వద్దకు రావాల్సిందే ఏ ఒక్కరోజు చెత్త సేకరణ వాహనాలు రాకపోయినా, మన ఇంటితో పాటు చుట్టు పక్కలో పరిసరాలు దుర్గంధం భరితంగా మారుతాయి. ప్రస్తుతం క్లాప్ డ్రైవర్లు కొన్ని నెలలుగా సరైన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎనిమిది నెలలుగా జీతాలు బంద్, పండుగనాడూ పస్తులే - వాహనాలను నిలిపేసి ఆందోళనకు దిగిన 'క్లాప్' డ్రైవర్లు
శ్రమకు తగిన జీతాలు లేవు : వీధుల్లోని చెత్తను సేకరించి తరలించటానికి వైఎస్సార్సీపీ సర్కార్ క్లీన్ ఆంధ్రప్రదేశ్- క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీటి కోసం ప్రత్యేక వాహనాలను పంపిణీ చేసింది. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వారు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నారే తప్ప శ్రమకు తగిన జీతాలు ఇవ్వట్లేదు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. 91 వాహనాలకు గాను 91 మంది డ్రైవర్లను నియమించారు. వారికి కేటాయించిన వార్డుల్లో మూడు లోడ్ల చెత్తను గార్గేయపురంలోని డంపింగ్ యార్డుకు తరలించాలి. ఇలా రోజూ సుమారు 200 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఎండనక, వాననక చెత్తను తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న క్లాప్ డ్రైవర్ల జీవితాల్లో మాత్రం వెలుగుల్లేవు.
అరకొర జీతాలతో బతకలేకపోతున్నాం.. హామీలు నెరవేర్చండి మహాప్రభో!: చెత్త సెకరించే వాహన డ్రైవర్లు
మళ్లీ మొదలైన కష్టాలు : క్లాప్ డ్రైవర్లు కొన్ని నెలలుగా సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 9 నెలలు జీతాలు రాలేదని ఆందోళనలు నిర్వహించారు. గతేడాది చివర్లో జీతాలు ఇచ్చారు. పరిస్థితి కుదుటపడిందనుకుంటే మళ్లీ కష్టాలు మొదటికే వచ్చాయి. ప్రైవేట్ ఏజెన్సీ ముఖం చాటేయడంతో క్లాప్ డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో రోజుకు 400 రూపాయలు ఇస్తామని చెప్పి వారిని పనిలోకి తీసుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా డ్రైవర్లను నమ్మించి నట్టేట ముంచారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా డ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జీతాల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"నెలకు 18 వేల జీతం ఇస్తామని క్లాప్ డ్రైవర్లను నియమించుకున్నారు. ఆ తర్వాత కేవలం 10 వేల రూపాయలే ఇస్తున్నారు. ఈ అరకొర జీతాలు కూడా 4 నెలలుగా రాక కుటుంబ పోషణకు కష్టమైంది. ESI, PF సౌకర్యం కూడా లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే క్లాప్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి?." - పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు