Kandula Durgesh Comments On Rushikonda: విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ఏ ఉద్దేశంతో నిర్మించారో తెలియదని, అంత విలాసవంతమైన భవనాలు ఏ రకంగా ఉపయోగించాలనే అంశంపై పెద్ద కసరత్తే జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సీఐఐ ఆధ్వర్యంలో విశాఖలో టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాల వినియోగం ఎంత ప్రయోజనకరంగా ఉండాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, నెల రోజుల్లోగా వీటి వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ భవనాల వ్యవహారంపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఒక అవినీతి ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నిర్మాణాలకు ఇవి నిలువుటద్దంగా ఉన్నాయని దుర్గేష్ అన్నారు.
Producer Daggubati Suresh Babu on Film Tourism: ఫిలిం పర్యాటకం అనేది చాలా దశాబ్దాల తరబడి కాన్సెప్ట్ అని, దీనిని అందిపుచ్చుకోవడం ఇప్పుడు స్థానికంగా ఉన్న ఔత్సాహిక వేత్తల చొరవను బట్టి ఉంటుందని ఈ కార్యక్రమం కోసం విశాఖకు వచ్చిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. విశాఖ పరిసరాలతోపాటు, అరకు ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్లు జరుగుతున్నాయని, వీటిని ఫిలిం టూరిజం కేంద్రాలుగా ప్రమోట్ చేసుకోగలిగితే ఎంతో ప్రయోజనంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సినిమా రూపు కూడా మారిందని, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది భారీగా ఆర్జిస్తున్నారని వివరించారు.
CII Tourism and Travel Summit 2024: కొత్త పర్యాటక పాలసీని రూపొందిస్తున్నామని, వివిధ వర్గాల నుంచి తీసుకున్న ఇన్పుట్స్తో టూరిజం పాలసీ కార్యాచరణకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర టూరిజంకు పరిశ్రమ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇది చాలా మంచి పరిణామంగా పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ 2024ను ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర పర్యాటకానికి పరిశ్రమ హోదా రావడం ఎంతో ఊరట ఇస్తుందని మంత్రి చెప్పారు.
"తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువ ఆదాయం వస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల కన్నా ఇక్కడే ఎక్కువ చిత్రీకరణలు జరుగుతున్నాయి. కానీ అందుకు తగ్గట్లు వసతులు కల్పించలేకపోతున్నాం. సినీ పర్యాటకంలో ఏపీ వెనకబడటానికి ఇదీ ఓ కారణం కావొచ్చు. సినీ పెద్దలంతా కలిసి విజయవాడ వస్తే, సినీ పర్యాటకాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూర్చుని మాట్లాడుకుందాం. మంచి పాలసీ రూపొందించేలా చర్చిద్దాం. ఏపీలో ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ లేనిదల్లా సౌకర్యాలే. గత ప్రభుత్వ హయాంలో కనీస ప్రోత్సాహం లేక ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపలేదు. అందుకే మేము పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తాం. పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకువస్తే, ప్రభుత్వం తరఫున కావాల్సిన సహకారం అందిస్తాం". - కందుల దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో పర్యాటక రంగం మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. గత ఐదేళ్లుగా ఒక చిన్న కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం టూరిజం పరంగా రాష్ట్రం వెనకబాటుకు కారణమని మంత్రి అభిప్రాయపడ్డారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే రంగాల్లో పర్యాటకం ఒకటని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పథకాలను కూడా విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
"రాత్రిపూట రెస్టారెంట్లు, హోటళ్లు నడుపుకునే వారికి సమయాన్ని పెంచేందుకు సీపీ అంగీకరించారని చెప్పడం సంతోషంగా ఉంది. విశాఖలో రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి పదిన్నర నుంచి 12 వరకు నడుపుకోవచ్చు. ఐటీ మహిళా ఉద్యోగుల ప్రయాణ భద్రత అంశంలో కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. సమస్య పరిష్కరించేలా లైట్లు, రవాణా సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తాం. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బస్సు కనెక్టవిటీ కల్పించాలని సంస్థ కోరినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మేం వచ్చాక ఐటీ మంత్రి కూర్చుని 5 నిమిషాలు మాట్లాడగానే సమస్య పరిష్కారమైంది. రెండ్రోజుల క్రితమే వారి కోసం 4 బస్సులు ప్రారంభించాం". - శ్రీ భరత్, విశాఖ ఎంపీ
తిరుమలలో ఏపీటీడీసీ హోటళ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ - Kandula Durgesh Inaugurated Hotels