Child Suffering With Rare Disease Needs Help: ఊహ తెలియని పసిప్రాయం బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆయితే ఆ ఆరు నెలల పసిప్రాణాన్ని జన్యుపరమైన వ్యాధి పీడిస్తోందని తెలిశాక వారు మనోవేదన చెందుతున్నారు. ఈ వ్యాధికి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు అవుతుందని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి అయిన చిన్నారి తండ్రి అంత మొత్తం సమకూర్చడం అయ్యేపని కాదు. దీంతో వసివాడని ఆ పసి ప్రాణాన్ని కాపాడుకునేందుకు దాతల సాయం కోసం కన్నవారు ఎదురుచూస్తున్నారు.
కళ్ల ముందే ఆరు నెలల బాబు ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి బారిన పడటం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పనసతోట 4వవార్డుకు చెందిన షేక్ యాసిన్, షేక్ షీరీన్ దంపతులకు ఇద్దరు కుమారులు. షేక్ యాసిన్ ప్రైవేటు ఉద్యోగి. రెండో కుమారుడైన జయాన్‌కు 3 నెలల వయసప్పుడు మెడ వంగి ఉండటం కాళ్లు, చేతులు ఆడించకపోవడం గమనించిన తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు.
జన్యుపరమైన వ్యాధి ఉందని, కొన్ని పరీక్షలు చేసి హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. అక్కడ మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా ప్రాణాంతకమైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఉందని వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం టైప్-1లో ఉందని, ఏడాదిలోపు ఖరీదైన ఇంజక్షన్ వాడాలని వైద్యులు తెలిపారు. దీనికి 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో బాబు తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగాలు చెందారు.
ఆర్థిక స్థోమత లేక, నిర్లక్ష్యం చేస్తే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. బాబు ఆ వ్యాధి వల్ల కూర్చోవడం, మింగడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బాబుకు ఇంజక్షన్ ఇచ్చేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు దాతలు, ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నారు.
"మా బాబు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం టైప్-1లో ఉందని, ఏడాదిలోపు ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులు తెలిపారు. దీనికి 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి అయిన నేను అంత మొత్తం సమకూర్చటం అయ్యేపని కాదు. దీంతో మా బాబు ప్రాణాన్ని కాపాడుకునేందుకు దాతల సాయం కోరుతున్నాం" - యాసిన్, బాలుడి తండ్రి
ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur