Child Marriage Nandigama in Krishna District : కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు వివాహం చేసుకుని నేరుగా గురువారం పెడన పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇద్దరిలో వరుడు మైనర్ (పెళ్లికి) కాగా వధువు మేజర్ కావడం గమనార్హం. అసలు చట్టాలు ఏమంటున్నాయంటే!
ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అమ్మాయిల కనీస వివాహ వయసు మరో మూడేళ్లకు పెంచాలని రెండేళ్ల కిందట కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కనీస వివాహ వయస్సుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వచ్చాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం వల్ల వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలకు తోడు చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కనీస వయసు కూడా 21 ఏళ్లకు పెంచాలని పలువురు కోరుతున్నారు.
పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు వివాహం చేసుకుని నేరుగా గురువారం పెడన పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇద్దరిలో వరుడు మైనర్ (పెళ్లికి) కాగా వధువు మేజర్ కావడం గమనార్హం. వధువుకు 18 ఏళ్లు నిండగా వరుడికి 19 సంవత్సరాలు మాత్రమే. అమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, అబ్బాయి ఇంటర్మీడియట్‌తో సరిపెట్టేశాడు. వరుడి కనీస వివాహ వయస్సు తక్కువగా ఉండడంతో పోలీసులు ఇరువైపులా పెద్దల్ని పిలిపించి చర్చించారు. పెళ్లి విషయంలో 21 సంవత్సరాలు దాటే వరకు యువకుల్ని మైనర్‌గా పరిగణించాలని చట్టం స్పష్టం చేస్తోందని ఎస్ఐ జి. సత్యనారాయణ వారికి వివరించారు. దీనిపై కేసు నమోదు చేయాలా లేక, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలా అని ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.
కనీస వయస్సు నిర్ధరణ విషయంలో గతంలో నీతి ఆయోగ్ జయ జైట్లీ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ బృందం దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటన్నింటినీ పరిశీలించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆ మేరకు అమ్మాయిలు తొలిసారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది. అమ్మాయిలకు 21 ఏళ్లకు వివాహం చేయడం వల్ల ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది.
"పుత్తడిబొమ్మ పూర్ణమ్మ" కష్టం - పెళ్లి పంజరంలో బంగారు బాల్యం
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!