CM Review on Education and skill Calculation : విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్‌లో మార్పు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తమ విద్యార్ధులను ప్రోత్సహించేలా ప్రతిభా అవార్డులు ప్రారంభించాలన్నారు. అలాగే జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సాహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా : విద్యాశాఖ, నైపుణ్య గణన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించటమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ : వచ్చే 10-20 ఏళ్లకు ఎలాంటి పాఠ్యాంశాలు అవసరం అన్న అంశాన్ని గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అపార్ ఐడీని ప్రతి విద్యార్ధికి ఇవ్వాలని స్పష్టం చేశారు.
త్వరలో జన్మభూమి 2.0 : ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాల్ని సద్వినియోగం చేసుకుని విద్యార్ధుల్ని క్రీడలవైపు ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన రిపోర్టు కార్డులతో పాటు క్రీడల గురించిన రిపోర్టు కార్డులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. జీవో నెంబర్ 117పై విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు చెల్లించాలని స్పష్టం చేశారు. స్కూళ్లలో ఇంగ్లీష్‌తో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సీఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 ప్రారంభిస్తున్నామని ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ది చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని అన్నారు.
సీఎంకు వివరించిన మంత్రి లోకేశ్ : విద్యాశాఖలో నూతన విధానాలు, సంస్కరణలపై ఆ శాఖ మంత్రి లోకేశ్ సీఎంకు వివరించారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా యాప్‌ల భారాన్ని తగ్గించామన్నారు. విద్యార్థులకు బోధన, నాణ్యత, సేవల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పేరెంట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షలపై ఏడాది చివర్లో థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయాలని సూచించారు.
నైపుణ్య గణన కార్యక్రమం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన కార్యక్రమంపై అధికారులు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3కోట్ల 54లక్షల మంది పనిచేసే వయసు ఉన్న ప్రజలు ఉన్నారని వారి నైపుణ్యాలను గణన చేయాల్సి ఉందని తెలిపారు. దీని కోసం 48 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమని స్కిల్ సెన్సెస్ కోసం 8 నెలల సమయం పడుతుందని తెలిపారు. కేవలం సర్వే చేసేందుకే 55 నుంచి 70 రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రాథమిక నైపుణ్యం, వ్యక్తిగతంగా సాధించిన నైపుణ్యాలతో పాటు ఏఏ అంశాల్లో నిపుణత ఉందన్న అంశాలను కూడా గుర్తించాలని సీఎం సూచించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు.
వరదలతో ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ: సీఎం చంద్రబాబు - CM Review on Agriculture