Chandrababu Will Come to NTR Bhavan: ప్రభుత్వానికి - పార్టీకి మధ్య అంతరం రాకుండా ఉండేలా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు కార్యాలయ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇకపై తరుచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు రచించుకుంటున్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రభుత్వానికి- పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకోనున్నారు.
'వారి సేవలు వేరే రూపంలో వినియోగించుకుంటాం' - చంద్రబాబును కలిసిన మంత్రులు, సీనియర్ నేతలు
పార్టీ- ప్రభుత్వం సమన్వయం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పాలనకు సమయం ఇస్తూనే పార్టీని పట్టించుకోవాలని ఇదే విధానాన్ని పాటించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం సందేశం ఇవ్వనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం రెండు రోజులపాటు సచివాలయానికి వెళ్లారు. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పార్టీ కార్యకర్తలు, నాయకులకు సీఎం సమయం ఇచ్చారు. 2014లో గెలిచిన తర్వాత పాలనా వ్యవహారాల్లో పడి చంద్రబాబు పార్టీకి సమయం కేటాయించలేకపోయారు. ఈసారి నిర్థిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పని చేసిన వారికే పదవుల అనే విషయంలోనూ స్పష్టతతో ఉన్నారు. ఇకపై కార్యకర్తలు, నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చారు. తొలుత ఆయన షెడ్యూలు ప్రకారం సాయంత్రమే తిరిగి వెళ్లాల్సి ఉండగా అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మంత్రులు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబును అభినందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీకి చెందిన పలువురు నేతలు సచివాలయానికి వచ్చారు.