Chandrababu Phone to DGP Harish Kumar Gupta : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైఎస్సార్సీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో ఆయన మాట్లాడారు. పోలింగ్ అనంతరం ప్రణాళికా బద్దంగా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపారు : తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ మూక దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. "పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను" అని లోకేశ్ ట్విటర్ (X)లో పోస్టు పెట్టారు.
తిరుపతి, కారంపూడిలో ఉద్రికత్త వాతావరణం : మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
సీమలో వైసీపీ దాదాగిరి - ప్రతిపక్షాలపై దాడులు - Elections in Rayalaseema
మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించిన ఆ పార్టీ శ్రేణులు ఇవాళ కూడా దాడుల పరంపరను కొనసాగించాయి. మంగళవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు. ఈక్రమంలో ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన టీడీపీ నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టారు. దాడులను ఆపేందుకు యత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా దాడికి తెగబడ్డారు. పట్టణంలో తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు.
ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - police booked Case on Tenali MLA