Chandrababu participated in Ugadi celebrations: తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అయిదేళ్ల కష్టాలు మర్చిపోయి కొత్త ఆశలతో ఉగాదిని ప్రారంభిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. జీవితాల్లో వెలుగులు వస్తాయనే సంకల్పం ప్రతీ ఒక్కరూ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది రాష్ట్ర ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సంక్షేమం అందడంతో పాటు అభివృద్ధి జరగాలని, ధరలు తగ్గాలని, శాంతిభద్రతలు అదుపులో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంపద సృష్టి జరిగి మంచి కోసం ఖర్చు జరగాలని అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లుగా ఉగాది పచ్చడి లాంటి షడ్రుచులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. పాలన మొత్తం చేదు, కారంతో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో భకాసురుడిని చూశామని, జగన్ పాలన అంతకంటే తక్కువగా ఏమీ లేదని మండిపడ్డారు. సమాజంలో జగన్ కు స్థానం లేకుండా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లిం సోదరులు సహా, ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తెలుగు జాతి నేడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి 100 లాగేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తోందని మండిపడ్డారు. హింసా రాజకీయాలు, సమస్యలతో జాతి నిర్వీర్యమైపోతోందని దుయ్యబట్టారు. తెలుగుజాతి పూర్వవైభవం కోసం ప్రతీ ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు గెలిచి, రాష్ట్రం నిలబడటమే అందరి లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. 14లక్షల కోట్ల అప్పును భరిస్తూనే రాష్ట్ర పునర్ణిర్మాణం జరగాలన్నారు. తన జీవితంలో ఖచ్చితంగా పేదరికం లేని సమాజాన్ని చూస్తానని చెప్పారు.
పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేస్తాం- ఉగాది వేడుకల్లో పవన్ - Pawan Kalyan Ugadi Celebrations
కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు 10 వేల రూపాయల గౌరవ భృతి కల్పిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే కాకుండా వాలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. వైసీపీ సహజ వనరులను దోపిడీ చేసేసిందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్లు పేరుతో జగన్ శవ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థే లేదనే కొత్త అబద్ధం తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్తను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా అని నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థపై జగన్ తొలి సంతకం పెడతానంటున్నాడంటే, ఇప్పుడు వ్యవస్త లేనట్టేనా అని ప్రశ్నించారు. జగన్ ఎంత స్వార్ధపరుడో వాలంటీర్లు అర్ధం చేసుకోవాలని సూచించారు.