Chandrababu Naidu Swearing Arrangements at Kesarapalli: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు పన్నెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర రవాణా, భవనాలశాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు.
కేసనపల్లిలోని ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకార సమయం మారిందని వస్తున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. ఎక్స్‌లో ఏపీ సీఎంఓ చేసిన పోస్టులో ఉదయం 9:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా వచ్చిందని తెలిపాయి.
'థాంక్యూ వెరీమచ్ అమ్మా'- తారక్ పోస్టుకు చంద్రబాబు రిప్లై - cbn tweet
ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు: వేదిక, బారికేడింగ్, బ్లాక్‌ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటూ లేకుండా చూడాలని కోరారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాన సభాస్థలి, విమానాశ్రయం, ఐటీపార్కు, పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారుల బృందంతో రాష్ట్ర అదనపు కార్యదర్శి డీజీ ఎస్. బాగ్చి ఏర్పాట్లపై సమీక్షించారు.
ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణ, జేసీ గీతాంజలిశర్మ, ఇతర అధికారులతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రదేశాన్ని ప్రద్యుమ్న శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.
కూటమి విజయంతో టాలీవుడ్లో జోష్ - సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభినందనలు
12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం: సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ శనివారం సమీక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.