Chandrababu allegations on CM jagan: నవరత్నాలు పేరుతో ప్రజలను మోసగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నవరత్నాల్లో ఇసుక, గంజాయి, భూ మాఫియా, మైనింగ్, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్‌మెంట్లు దాడులు-కేసులు, శవ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కడప ఏడురోడ్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలని చంద్రబాబు తెలిపారు.
జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్న చంద్రబాబు, తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అన్న, చెల్లి ఇంట్లో పోరాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుందన్నారు. సీబీఐ అరెస్టు చేసే సమయంలో అధికారం ఉపయోగించి అడ్డుకున్నారు, ఈ ముగ్గురు మారీచులు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొండలను అనకొండలు మింగేశాయని దుయ్యబట్టారు.
వలస పక్షులకు కొండెపివాసులు మద్దతివ్వరు: డోలా బాల వీరాంజనేయ స్వామి - Dola Bala Veeranjaneya Swami
అధికారం మదంతో జగన్ అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేశారు, నేను శంకుస్థాపన చేశాక మరోసారి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అంగుళమైనా కదిలిందా? అంటూ ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?, రాయలసీమ ద్రోహి జగన్‌కు ఓటు వేస్తారా అని దుయ్యబట్టారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని, అభివృద్ధిలో జగన్ చేసింది శూన్యం అని ఎద్దేవా చేశారు.
దుర్మార్గులు వస్తే పరిశ్రమలు పారిపోతాయన్న చంద్రబాబు, జగన్ దెబ్బకు అమరరాజా, లులూ వంటి పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. కూటమి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయని పేర్కొన్నారు. రిమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 99శాతం హామీలు అమలు కాలేదని, కూటమి మ్యానిఫెస్టోలో దమ్ముందన్నారు. అన్ని వర్గాలవారికి న్యాయం చేశామని పేర్కొన్నారు. సంపద సృష్టించి, ప్రజలకు పంచడమే మా విధానం. అధికారంలోకి వచ్చిన వారంలో జగన్ సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. పీఆర్‌సీ ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.