Chandrababu Naidu Fires On CM Jagan: రాష్ట్ర విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనతోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్న ఈ దొంగ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
నేరాల రాజధానిగా మార్చారు: జగన్ పరిపాలనలో పేదలు నిరుపేదలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. పేదల రక్తం తాగే వ్యక్తి పేదల ప్రతినిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. జగన్ భస్మాసురుడిలా ప్రజల నెత్తిన చేయి పెట్టారని విమర్శించారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలని ప్రజలను కోరారు. జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పని చేయవని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తన నాటకాలతో పేదలను మోసగిస్తున్నారని, ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదని, ఇక్కడి భూములపైనే ప్రేమ అని చంద్రబాబు ఆరోపించారు. విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అర్హత లేని జగన్‌ను చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములు కొట్టేశారని పేర్కొన్నారు. విశాఖకు వచ్చిన అన్ని కంపెనీలు పారిపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్, జగన్‌ది పాయిజన్: చంద్రబాబు
ఎమ్మెల్యే ఇసుక అక్రమాలు: సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పి నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఉత్రరాంధ్ర ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే, ఇలాంటి నీచ రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనపై ప్రజావ్యతిరేకిత పెను తుపానుగా మారుతుందని అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులోనే ఉండరని, ఎమ్మెల్యే శాంతి నియోజకవర్గానికి పట్టిన అశాంతి అని విమర్శించారు. వంశధార నుంచి ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వసూళ్ల పర్వాన్ని ఎమ్మెల్యే తన పీఏలకు అప్పగించారని పేర్కొన్నారు.
'శ్రీకాకుళం రా కదలి రా' - చంద్రబాబు సభ విజయవంతానికి తమ్ముళ్ల సన్నాహాలు
టెక్కలికి వైద్య కళాశాల: ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం-జనసేన రావాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నదులు అనుసంధానించి 6 నియోజకవర్గాలు సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. టెక్కలికి వైద్య కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. కళింగ వైశ్యులను ఓబీసీల్లో చేర్చే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి సుపరిపాలన తీసుకువస్తామన్నారు.