Chandrababu Prajagalam Sabha: కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని తెలుగుదేశం అధినేత నారా చద్రబాబు నాయుడ హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి, అనంతపూరం అర్బన్‌లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లా మారిందని పేర్కొన్నారు. వైసీపీ నేతల భూములను కూడా జగన్ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మంచినీళ్లు రాలేదని అడిగినందుకు గర్భిణి అని చూడకుండా, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి సాక్షిగా వైసీపీ నాయకులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు.
ఇక పాపాల పెద్దిరెడ్డికి టైమ్ దగ్గరపడిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిది ఎర్రచందనం, మైనింగ్, ఇసుక మాఫియా అని ఆరోపించారు. రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలు మనకు అవసరమా?అని ప్రశ్నించారు. చంద్రబాబు, తాను కలిసి చిత్తూరు జిల్లాకు ఎంతో మేలు చేశామని గుర్తు చేశారు.
ఈ నెల 13వ తారీకున ఫ్యానుకు, జగన్ పార్టీకి ఉరివేయాలని చంద్రబాబు అన్నారు. రాతియుగానికి ముగింపు పలికి, స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలని, అనంతపురం ప్రజాగళం సభలో పిలుపునిచ్చారు. కల్తీ మద్యంతో ఆడవాళ్ల మంగళసూత్రాలు తెంచిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ఏం చేశాడో, రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో చెప్పే దమ్ముందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పరిశ్రమను కూడా తేలెకపోయారని మండిపడ్డారు. అనంతపురంకు పరిశ్రమలు తీసుకురావని ప్రణాళికలు తయారు చేశానని తెలిపారు. అనంతపురం కోసం అనేక పనులు చేసినట్లు గుర్తు చేశారు. ఇంకా కొంత మంది జగన్ మాయలో ఉన్నారని, రాయలసీమ నుంచి వైసీపీకి 47 ఇస్తే, ఏం న్యాయం చేశాడని ప్రశ్నించారు. తాను రాయలసీమ కోసం వేల కోట్లు ఖర్చుచేశానని తెలిపారు. గతంలో సైతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా, ఒక్క ముస్లింకైన అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ముస్లింల కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని, గుర్తు చేశారు. మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామి హామీ ఇచ్చారు. మసీదుల నిర్వాహణకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడుతామని హామీ ఇచ్చారు. దిల్లీలో ఓ రాజకీయాలు చేస్తారు, గల్లిలో మరో రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు.