Central Team AP Tour 2024 : ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనుంది.
ఈ క్రమంలోనే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను అధికారులు వారికి వివరించారు. అనంతరం వారు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. బ్యారేజీ ప్రవాహం ఇతర వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వివరించడంతో పాటు అందుకు సంబంధించిన వివరాలను వారికి వివరించారు.
AP Floods 2024 : మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఇవాళ నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. నేడు విజయవాడతో పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు శివరాజ్ వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలు, రైతులతో ఆయన మాట్లాడుతారు. అనంతరం విజయవాడలో అధికారులతో భేటీ అవుతారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించే అంశంపై కేంద్రమంత్రి పలు సూచనలు చేయనున్నారు.