Central Govt Green Signal to 6 Line Elevated Corridor in Ranasthalam : రహదారులు అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఆరు లైన్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి రూ. 252 కోట్లు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రణస్థలం రహదారిని విస్తరణ చేయాలంటూ గత పాలకులకు అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే తమ సమస్యను పరిష్కరించిందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
2 కిలోమీటర్ల మేరా 6 లైన్ల రహదారి : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఏళ్లు తరబడి అపరిష్కృతంగా ఉన్న జాతీయ రహదారి విస్తరణకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. గురువారం (అక్టోబర్ 24న) ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రోడ్డు విస్తరణకు ఆమోదం లభించింది. ఇందుకోసం రూ. 252.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి రణస్థలం గ్రామ ప్రారంభంలోని పెట్రోల్ బంకు నుంచి రావివలస వరకు సుమారు 2 కిలోమీటర్ల మేరా 6 లైన్ల రహదారి నిర్మించనున్నారు. ఇందులో 800 మీటర్ల వరకు ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ టెండర్లు ప్రక్రియ పూర్తయినట్లుగా తెలుస్తుండటంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి.
రెట్టింపు వేగం- తగ్గనున్న సమయం - హైదరాబాద్ టు విశాఖ 4 గంటల్లోపే!
కూటమి ప్రభుత్వం చొరవ : 2016లోనే ఈ 6 వరుసల రహదారి పూర్తి కావాల్సి ఉండగా అప్పట్లో కొందరు రైతులు, వైఎస్సార్సీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో బైపాస్ నిర్మాణం రణస్థలం ప్రాంతంలో ఆగిపోయింది. గత ఐదేళ్లలో స్థానికులు రోడ్డు విస్తరణ చేపట్టాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కనీసం పట్టించుకోలేదు. నిత్యం రద్దీగా ఉండే రణస్థలం ప్రాంతంలో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో కళ నెరవేరుతుందని ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరితగతిన చేపట్టిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఆ రెండు రోడ్లు పూర్తయితే దూసుకుపోవడమే! - విజయవాడ తూర్పు బైపాస్ ఎక్కడినుంచి వెళ్తుందంటే!