CAG Report on Veligonda Irrigation Project : వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెళ్ల నిర్మాణం పూర్తయినా జలాశయంలో నీళ్లు నింపే పరిస్థితులు లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడం వల్ల ఆయకట్టుకు నీరందించే పరిస్థితులు లేవని కాగ్ తన నివేదికలో తూర్పారపట్టింది. గుత్తేదార్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టింది. 2017 నుంచి 2021 వరకు 2 వేల 190 కోట్లు బడ్జెట్లలో కేటాయించినా 12 వందల 70 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొంది.
నాగార్జునసాగర శ్రీశైలం రిజర్వు అభయారణ్యంలో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో టన్నెళ్ల తవ్వకాన్ని మాన్యువల్ డ్రిల్, బ్లాస్టింగ్ పద్ధతికి మార్చివేశారన్న కాగ్ అలా మార్చేముందు పర్యావరణ పరంగా ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించకుండానే 2020లో నిర్ణయం తీసుకున్నారని తప్పుబట్టింది. రెండో సొరంగంలో తవ్వకాలు చేసేందుకు అనుమతులు లేకుండానే మూడుచోట్ల ఆడిట్ తవ్వకాల పనులు చేపట్టారని 2022 ఏప్రిల్‌లో 277 కోట్ల రూపాయలతో ఎలాంటి అనుమతులూ లేకుండానే గుత్తేదారుతో అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నారు అని కాగ్ కుండబద్దలు కొట్టింది. టన్నెల్ బోరింగు మిషన్‌తో పని చేసేటప్పుడు కాంక్రీట్ లైనింగును ముందుగా సిద్ధం చేసుకున్న సెగ్మెంట్లతో చేస్తారన్న కాగ్ తరువాత టన్నెల్ బోరింగు మిషన్‌ను ఉపయోగించకపోవడంతో కట్టర్లు, సెగ్మెంట్ల కోసం చేసిన ఖర్చు 2.96 కోట్లు వృథా అయింది’అని స్పష్టం చేసింది. ధరల్లో వ్యత్యాసాలు, బ్యాంకు హామీలు, బీమా ఛార్జీల తిరిగి చెల్లింపు తదితర వాటికోసం ఒప్పంద విలువ కన్నా 630.57 కోట్లు అదనంగా చెల్లించారని కాగ్ విశ్లేషించింది.
లింకు కాలువల నిర్మాణాల్లో లోపాల వల్ల రెండో సొరంగం చివర 4.110 కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉందన్న కాగ్ సొరంగం నుంచి నీరు బయటకు వచ్చే ప్రదేశం వద్ద అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లే లింకు కాలువల బెడ్ లెవెల్ తేడా ఉండటంతో ఈ సమస్య తలెత్తబోతోందని స్పష్టం చేసింది. తగినంత నీటి విడుదల సామర్థ్యం లేకుండా ఫీడర్ కాలువ నిర్మించారని రెండు సొరంగాల నుంచి గరిష్ఠంగా 483.32 క్యూమెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉంటుందని తెలిపింది. ఫీడర్ కాలువను కేవలం 328 క్యూమెక్కుల సామర్థ్యంతోనే రూపకల్పన చేశారని ఫీడర్ కాలువకు లైనింగు పనులు పూర్తి చేయని కారణంగా కేవలం 214.64 క్యూమెక్కుల జలాలను మాత్రమే సరఫరా చేయగలరని వెల్లడించింది. దీనివల్ల అవసరమైనంత మేర నీటిని ఆయకట్టుకు ఇవ్వలేరని కాగ్ స్పష్టం చేసింది.
వెలిగొండ టన్నెళ్ల తవ్వకాల్లో భాగంగా వచ్చిన శిథిలాలను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కొల్లంవాగు సమీపంలో పడవేశారన్న కాగ్ టన్నెళ్ల ద్వారా తీసుకొచ్చిన జలాలను నల్లమలసాగర్‌లో నింపాలనేది ప్రణాళికగా తెలిపింది. ఈ జలాశయం నిర్మాణంలో భాగంగా మూడు ఖాళీలను మూసివేసినా, నాలుగో ఖాళీని ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక నాటికి గుర్తించలేదంది. ఆ ఖాళీలో శాడిల్ డ్యాం నిర్మించాలన్న విషయాన్ని 2019 ఆగస్టులో గుర్తించారన్న కాగ్ శ్రీశైలం వరద జలాల ఆధారంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి లభ్యతపై సరైన అధ్యయనం చేయకుండానే పాలనామోదం ఇచ్చారని అభ్యంతరం తెలిపింది. కృష్ణా నది నుంచి తగినంత నీరు లభించకపోతే 4 వేల 323.72 కోట్ల రూపాయల ఖర్చు వృథా అవుతుందని తెలిపింది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గుత్తేదార్లతో ఈపీసీ విధానంలో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం పని పరిణామాలతో సంబంధం లేకుండా ప్రతి అంశానికి కేటాయించిన నిర్ధిష్ట శాతాలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలన్న కాగ్ ప్రాజెక్టు పని పరిధిలో మార్పు లేకపోయినా, నిర్మాణాలు, సొరంగాలు తదితర వాటికి ఐబీఎం పరిణామాలకు మించి జలవనరుల శాఖ మంజూరు చేసిందని తెలిపింది. కాలువలు, జలాశయాల మట్టికట్టల పొడవు తగ్గినప్పుడు దామాషా ప్రకారం ఒప్పంద ధర తగ్గించలేదని కాగ్ గుర్తించింది.
ఫీడర్ కాలువ, తూర్పు ప్రధాన కాలువ రెండు రీచ్‌లు, పశ్చిమ గట్టు కాలువ పనుల్లో మార్పు లేకున్నా 249.56 కోట్ల రూపాయల మేర అదనపు మొత్తాలు మంజూరు చేశారంది. ఇందులో 70.62 కోట్లు చెల్లించేశారంది. తూర్పు ప్రధాన కాలువ రెండు రీచ్‌లలో పని పరిమాణం తగ్గినా, ఆ మేరకు ధర తగ్గించలేదని కాగ్ తప్పు పట్టింది. ఆ విలువను 111.82 కోట్లు రూపాయలుగా పేర్కొంది. 29.35 కోట్ల విలువైన సొరంగం హెడ్ రెగ్యులేటర్ల పనులను అప్పటి గుత్తేదారును తొలగించి 95.44 కోట్లకు 2017 ఆగస్టులో వేరొకరికి అప్పగించారంది. అందువల్ల 66.09 కోట్ల అదనపు భారం పడినట్లయిందైందని తెలిపింది.
మొదటి టన్నెల్ తవ్వకం పనులను వేరే గుత్తేదారుడికి అప్పగించే క్రమంలో కొన్నింటిని ఒప్పందం విలువ కంటే ఎక్కువగా లెక్కించారన్న కాగ్ వాస్తవంగా 421.29 కోట్ల పని జరగ్గా, దాన్ని 475.83 కోట్లుగా చూపారని తప్పుబట్టింది.
'అసంపూర్తి ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేస్తారు? - వెలిగొండ పూర్యయ్యే వరకు బీజేపీ పోరాటం'