Group 1 Candidates Protest : గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం ఇవాళ కూడా కొనసాగుతోంది. పరీక్ష యధాతథంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. పరీక్షలు రద్దు చేయాలంటూ ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ముందుగా సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్‌లను కొందరు గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఇదే సమయంలో అక్కడకు బీజేపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని బండి సంజయ్, గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఛలో సచివాలయం అరెస్టులకు దారితీసింది. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వద్దకు వెళ్లిన బండి సంజయ్, వారితో కాసేపు మాట్లాడి.. చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు.
మహిళల్ని, గర్భిణీలను కొడుతున్నారు.. దాష్టీకానికి నిదర్శనం : జీవో 29పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. మహిళల్ని, గర్భిణీలను పోలీసులు కొడుతున్నారని, ఇది దాష్టీకానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్‌నగర్ నుంచి అభ్యర్థులతో కలిసి ర్యాలీగా సచివాలయం వైపు బయలుదేరగా ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సంజయ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలిపెట్టారు.
అశోక్ నగర్లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు
గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ - సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు