BRS Focus on MP Candidates 2024 : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే పార్టీలు కొన్ని అభ్యర్థిత్వాలను ఖరారు చేశాయి. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఆరు సీట్లలో పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగే వారి పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో హైదరాబాద్ జిల్లాకు చెందిన రెండు స్థానాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రెండు లోక్‌సభ సీట్లు ఉన్నాయి.
RS Praveen May Contest From Nagar Kurnool : మెదక్, నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించాల్సి ఉంది. మొదట పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీట్లను బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. అయితే పొత్తు విఫలం కావడంతో ఆ రెండు స్థానాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులను బరిలో దించాల్సి ఉంది. నాగర్కర్నూల్ స్థానానికి రాష్ట్ర బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, గులాబీ కండువా కప్పుకున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఖాయమైంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది.
మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ దాదాపు ఖాయమే. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి తలసాని సాయికిరణ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రెండు లోక్‌సభ స్థానాల అభ్యర్థిత్వాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం
నల్గొండ (Nalgonda MP Ticket) నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. చెరుకు సుధాకర్ కూడా రేసులో ఉన్నారు. భువనగిరి లోక్‌సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేష్తో పాటు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయమై ఆయా నియోజకవర్గాల పరిధిలోని నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థిత్వాల ప్రకటన పూర్తవుతుందని గులాబీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
BRS Leaders Party Changings : మరోవైపు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే టికెట్ ఆశించి అసంతృప్తి చెందిన నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ క్యాడర్ను కోల్పోతుంది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఇప్పుడుంది. లేని పక్షాన ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు.
'మల్కాజిగిరిలో గెలుపు మాదే' - విజయంపై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి ధీమా
కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో నేను ఒకణ్ని కాను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్