BPCL Representatives Visited Durgamma Temple in Vijayawada : రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆసక్తి చూపుతోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. బీపీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా, రిఫైనరీ హెడ్ రవితేజలు సీఎం చంద్రబాబుతో భేటీకి ముందు ఎంపీ బాలశౌరి వీరిని విజయవాడ ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈవో రామారావు, వేదపండితులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. జగన్మాత అనుగ్రహంతోనే తాము ఈ ప్రాంతానికి రాగలిగామని కంపెనీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం తరువాత బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని బాలశౌరి తెలిపారు. ఈ రిఫైనరీ ద్వారా సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. సుమారు 60 వేల కోట్ల రూపాయల వరకు భారీ పెట్టుబడి రాష్ట్రానికి వస్తుండడం శుభసూచకంగా పేర్కొన్నారు.
చంద్రబాబుతో భేటీ అయిన బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులు :
ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు సీఎంను కలిశారు.
ఆర్థికశాఖ శ్వేతపత్రంపై సీఎం సమీక్ష :
ఆర్థికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.14లక్షల కోట్ల వరకు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపైనా సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై శాఖల వారీగా వివరాలు కోరినట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ఈ సందర్భంగా ప్రతిపాదించింది.
ఉద్యోగం లేకున్నా పెన్షన్ కావాలా! - రోజుకు 7రూపాయలు పొదుపు చేస్తే చాలు - Atal Pension yojana