Boiler Exploded in Ultratech Cement Factory: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలెన్ విభాగంలో ట్యాంకు పగలడంతో దుర్ఘటన జరిగింది.
నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ముడి పదార్థాన్ని పంపుతూ వేడిచేసే పైపులైన్ మాదిరిగా ఉండే ట్యాంకు కింది భాగం ఊడిపోయింది. దీంతో 200 డిగ్రీలపైగా వేడితో ఉన్న పొడి కిందకు పడింది. ఇది విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడటంతో వారి శరీరమంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో బాయిల్ పేలుడుతో చుట్టుపక్కల భారీగా పొగలు వ్యాపించాయి. శబ్దం విన్న వెంటనే బూదవాడ గ్రామానికి చెందిన ప్రజలు హుటాహుటిన కర్మాగారానికి చేరుకున్నారు.
కానీ వారిని లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డగించి గేట్లకు తాళాలు వేసి పారిపోయారు. దీంతో కర్మాగారంలో తమవాళ్లకు ఏమైందోననే ఆందోళనతో గ్రామస్థులు ఆగ్రహావేశాలతో తాళాలు పగలగొట్టుకొని లోపలికి వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి లోపల మొత్తం పొగ కమ్మేసి ఉండడం, శరీరం కాలిపోయిన కార్మికుల హాహాకారాలతో ఏం జరుగుతోందో కూడా అర్థంకాని భయానక వాతావరణం నెలకొంది. ఆ తర్వాత బాధితులను ఒక్కొక్కరినీ గ్రామస్థులంతా కలిసి కర్మాగారానికి చెందిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి విజయవాడ, మంగళగిరిలోని ఆసుపత్రులకు గ్రామస్థులే తరలించారు.
హోటల్‌లో పేలిన కుక్కర్ - మంటలు చెలరేగి యువతి సజీవ దహనం - FIRE ACCIDENT IN HOTEL
సాధారణ రోజుల్లో కర్మాగారంలో 100 మంది వరకు కార్మికులు విధుల్లో ఉంటారు. నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో 30 మంది మాత్రమే ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మూడో అంతస్థులో ప్రమాదం జరగగా అక్కడ ఉన్న 16మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే నాలుగు, ఐదు అంతస్థుల్లో ఉన్న కార్మికులు కిందకు దిగి వారిని కాపాడారు. వారిలో మరో వ్యక్తికి స్వల్పంగా గాయాలవడంతో కర్మాకారంలోని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూదవాడకు చెందిన ఆవాల వెంకటేష్ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటన ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని బాధితుల బంధువులు, కార్మికులు ఆరోపించారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా డీఎమ్హెచ్వో సుహాసిని తెలిపారు. వీరిలో పదిమంది స్థానికులు కాగా మరికొంతమంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులుగా గుర్తించారు.
చంద్రబాబు ఆదేశాలు: దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు. మెరుగైన వైద్యంతో పాటు కంపెనీ నుంచి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
స్పందించిన మంత్రి: పేలుడు ఘటనపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రీ హీటర్ లోపంతో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు. ప్రీ హీటర్‌ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందని అన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేలుడు ఘటనపై నివేదిక ఇవ్వాలని మంత్రి సుభాష్ అధికారులను ఆదేశించారు.
వెంకటేష్ మృతితో కట్టలు తెంచుకున్న ఆగ్రహం: అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో ప్రమాదంపై బూదవాడ గ్రామస్థులు ఆదివారం రాత్రి ఆగ్రహంతో కంపెనీలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. గ్రామానికి చెందిన వెంకటేష్ మృతి చెందడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి కర్మాగారంపైకి రాళ్లు విసిరారు. పెట్రోలు డబ్బాలు తీసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇంతలో ఓ వ్యక్తి సెక్యూరిటీ పోస్టుపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. తమకు న్యాయం చేయాలని మృతుడు వెంకటేష్ భార్య, కుమార్తె గేటు వద్దకు విలపిస్తూ వచ్చారు. మృతుల సంఖ్య పెరిగితే, గ్రామంలో మరింత ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు ఉండడంతో అదనపు బలగాలను తరలించారు. గ్రామీణ డీసీపీ శ్రీనివాసరావు, నందిగామ ఏసీపీ రవికిరణ్ అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆదివారం రాత్రి బూదవాడ చేరుకుని, గ్రామస్థులతో చర్చించారు. మృతుని, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టైలర్ షాప్‌లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident