Blade Batch Hulchal in Vijayawada: రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. డబ్బులివ్వకపోతే బ్లేడ్లతో విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో బ్లేడ్ బ్యాచ్ నడిరోడ్డుపై యువకుడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపగా తాజాగా విజయవాడలో రైతు బజారులో కూరగాయలు దింపేందుకు వెళ్తున్న కార్మికుడిపై మత్తులో ఉన్న గ్యాంగ్ బ్లేడ్లు, కర్రలతో దాడి చేసి నగదు దోచుకెళ్లింది.
బ్లేడ్‌బ్యాచ్ అరాచకాలతో బెజవాడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పటమట రైతుబజార్ వద్ద బ్లేడ్ బ్యాచ్ బరితెగించి శనివారం ఓ వ్యక్తిపై దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పటమటకు చెందిన దిలీప్‌కుమార్ అనే ముఠా కార్మికుడు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైతుబజార్‌లో టమోటాలు దింపేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధవళేశ్వరంలో పెరుగుతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు..
దిలీప్ నిరాకరించడంతో దుండగులు దాడి చేసి జేబులోని 2 వేల రూపాయలు లాక్కొని వెళ్లారు. మళ్లీ వెంటనే తిరిగొచ్చిన దుండగులు దిలీప్‌పై కర్రలు, బ్లేడ్‌లతో దాడి చేసి పర్సులో ఉన్న మరో 8 వేల రూపాయలు లాక్కొని పరారయ్యారు. తోటి ముఠా కార్మికులు పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దిలీప్ పరిస్థితి నిలకడగా ఉంది.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దిలీప్‌పై దాడి చేసినవారిలో రెల్లీస్ కాలనీకి చెందిన ఒక సస్పెక్ట్ రౌడీషీటర్‌తో పాటు యనమలకుదురుకు చెందిన ఇద్దరు మైనర్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వీరిని అదుపులో తీసుకున్న సమయంలో వీరి వద్ద 18 వేల రూపాయల నగదు, మత్తు పదార్థాలు ఉన్నట్లు సమాచారం. దాడి చేసిన సమయంలో వారు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. బ్లేడ్ బ్యాచ్ ముఠాల దాడులతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు అధికారులు తక్షణ చర్యలు చేపట్టి తమను కాపాడాలని కోరుతున్నారు.