TDP, BJP, Janasena Leaders Friendly Gathering in Pulivendula : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో బీజేపీ, టీడీపీ జనసేన పార్టీలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, జనసేన బాధ్యుడు హరితో పాటుగా మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అక్రమాలతో పాటుగా ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోవడంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు: రాష్ట్రంలో నెలకొన్న దుష్టపరిపాలనను అంతమెుందించడానికి మూడు పార్టీల నేతలు చర్చించినట్లు బీటెక్ రవి (BTech Ravi) తెలిపారు. సీఎం జగన్కు ఓటుతో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ 8 వేల ఇళ్లు నిర్మిస్తే, అందులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను సీఎం జగన్ తాను ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని బీటెక్ రవి విమర్శించారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో పులివెందులలో మెడికల్ కళాశాలను సీఎం హడావిడిగా ప్రారంభించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే మెడికల్ కళాశాలను ప్రారంభించారని ఆరోపించారు. మెడికల్ కళాశాలకు అనుమతులు వచ్చి ఉంటే వాటిని మీడియాకు చూపించాలని తాము ప్రశ్నించామన్నారు. ఇదే అంశంపై మున్సిపల్ చైర్మన్ స్పందించారని, తాము ప్రారంభించింది మెడికల్ కాలేజీ కాదు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని చెబుతారని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.
టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన చంద్రబాబు- 34మందికి చోటు
ఈసారి జగన్ ఓటమి ఖాయం: వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సమయంలో ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేసే అక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని బీటెక్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలపై దౌర్జన్యాలను అడ్డుకొని, స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అందరం కలిసికట్టుగా పోరాడుతామన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని బీటెక్ రవి జోస్యం చెప్పారు.
అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రారంభోత్సవాలు: పులివెందులలో అభివృద్ధి పేరిట అక్రమాలు జరిగాయాని బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి (Shasibhushan Reddy) ఆరోపించారు. వాటర్ ట్యాంక్, ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఇలా ఎన్నికల కోసం ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. గతంలో బస్స్టాండ్ నిర్మిస్తే పెచ్చులు ఊడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఇక్కడ గత నలబై సంవత్సరాలుగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేవని శశిభూషణ్ రెడ్డి ఆరోపించారు.