farmers and handloom workers suicides in AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో, 15 రోజుల్లోనే ఎనిమిది మంది రైతులు, ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్‌ను నమ్మి, 49 సీట్లు వైఎస్సార్సీపీకి కట్టబెట్టినందుకు రాయలసీమ అనుభవిస్తున్న పాపమిది అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సత్యకుమార్ పోస్ట్ చేశారు.
రైతులకు రాయితీపై బిందు సేద్యం పరికరాలు లేవని,సకాలంలో పంట నష్టపరిహారం ఇవ్వలేదని సత్యకుమార్ మండిపడ్డారు. చేనేతకు ఇచ్చే సబ్సిడీలకు కోత పెట్టడం, సకాలంలో చేయూత, అందకపోవడం.. ఈ ‘అనంత’ శోకానికి జగన్ చేతగాని పాలనే కారణమని అన్నారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా ఉందని ఎద్దేవా చేశారు. అప్పుల బాధ తాళలేక అన్నదాతలు, చేనేత కార్మికులు ప్రాణాలు తీసుకుంటుంటే, జగన్ మాత్రం విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా ఈ బలవన్మరణాలకు గత పాలకులనో, లేక కోడ్ అమల్లో ఉందని ఈసీనో నిందించకుండా తక్షణం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. చేసిన తప్పులను, పాపాలను కొంతవరకైనా ప్రక్షాళన చేసుకోవాలని హితవు పలికారు.
రైతులు, నేతన్నల ఆత్మహత్యలు దురదృష్టకరం. జగన్‌ను నమ్మి, 49 సీట్లు కట్టబెట్టినందుకు సీమ అనుభవిస్తున్న పాపమిది. రైతులకు రాయితీపై బిందు సేద్యం పరికరాలు లేవు. సకాలంలో పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ‘అనంత’ శోకానికి జగన్ చేతగాని పాలనే కారణం. రైతులు చనిపోతుంటే.. జగన్ విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. సత్యకుమార్ యాదవ్, బీజేపీ నేత
పవర్ ప్రాజెక్టుల పేరుతో భూదోపిడీ : పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ అస్మదీయులు రెచ్చిపోయారని బీజేపీ ఆరోపించింది. 4 లక్షల ఎకరాల భూమిని జగన్ అస్మదీయులు భూ దోపిడీకి తెరలేపారని బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి సామర్థ్యం, అనుభవం లేక పోయినా లక్షల ఎకరాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. జగన్ అస్మదీయుల వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకు అవరోధంగా మారిందని లంకా దినకర్ అన్నారు. వైఎస్సార్సీపీ భూ దోపిడీపై రాబోయే ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు.